ఉత్తర కొరియా మరో దుస్సాహసం

5 Apr, 2017 09:02 IST|Sakshi
ఉత్తర కొరియా మరో దుస్సాహసం

ట్రంప్-జిన్‌ పింగ్ భేటీ నేపథ్యంలో క్షిపణి పరీక్ష
ప్యొంగ్ యాంగ్: తరచూ వివాదాస్పద చర్యలకు పాల్పడే ఉత్తర కొరియా మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికా సహా పలు అగ్రదేశాలు హెచ్చరించినా ఇటీవల పలు క్షిపణి, అణు పరీక్షలు చేసిన ఉత్తరకొరియా మరోసారి అదే దుశ్చర్యకు దిగింది. ఉత్తర కొరియా బుధవారం ఓ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, అమెరికా మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ లు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణిని పరీక్షించడం చర్చనీయాంశమైంది. జపాన్-చైనాలతో పాటు అమెరికాకు సూచనప్రాయంగా తెలిపేందుకే ఈ చర్యలకు దిగుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

చైనాతో కలసి మమ్మల్ని ఎదుర్కోవాలని, మా చర్యలను నియంత్రించాలని చూడటం కాదని.. సొంతంగా అమెరికా తమ ఆధిపత్యాన్ని అడ్డుకోగలదా అని సవాల్ చేస్తున్నట్లు క్షిపణి పరీక్ష మరోసారి నిరూపించింది. అమెరికా హెచ్చరిస్తున్నా ఉత్తర కొరియా ఇప్పటికే ఐదు అణు పరీక్షలు నిర్వహించగా, అందులో రెండు గతేడాది చేసింది. తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ భవిష్యత్తులోనూ మరిన్ని అణు పరీక్షలకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 6, 7 తేదీల్లో ఫ్లోరిడాలోని మార్‌ ఏ లాగో అనే ట్రంప్‌ నివాసంలో ట్రంప్‌, జిన్‌పింగ్‌ భేటీ కానున్న విషయం తెలసిందే. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరి మధ్య జరగనున్న తొలి భేటీ ఇది. అమెరికా, చైనాల మధ్య ఉన్న ఆందోళనకరమైన విషయాలతో పాటు ఉత్తర కొరియా అంశం, వర్తక వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, ఉద్యోగాలు వంటి కీలక అంశాలను ట్రంప్, జిన్ పింగ్ చర్చించనున్నారు.

ఉత్తర కొరియా చేపట్టిన ఈ చర్యను జపాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా భద్రతా మండలి నిర్ణయాలను ఆ దేశం ఉల్లంఘించడంపై జపాన్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక వారి చర్యలను ఏమాత్రం తేలికగా తీసుకోరాదని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిహిదే సుగా స్పష్టం చేశారు. ఈ బాలిస్టిక్ మిస్సైల్ 60 కిలోమీటర్ల సామర్థం ఉందని దక్షిణ కొరియా తెలిపింది. కేఎన్-15 మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అయి ఉండొచ్చునని అమెరికా అభిప్రాయపడింది. ట్రంప్‌, జిన్‌పింగ్‌ భేటీలో కచ్చితంగా ఉత్తర కొరియాను నియంత్రించడంపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు