ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష

30 May, 2017 01:06 IST|Sakshi
ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష

సైనిక చర్య జరుపుతామన్న అమెరికాను రెచ్చగొట్టేందుకే..
► ఈ ఏడాదిలో 12వ ప్రయోగం
సియోల్‌:  అమెరికా, ఐరాస హెచ్చరికల్ని  బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా  సోమవారం మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. 450 కి.మీ. ప్రయాణించిన స్కడ్‌ తరహా క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో కూలినట్లు దక్షిణ æకొరియా పేర్కొంది. ఉ.కొరియా తాజా క్షిపణి ప్రయోగంతో కొరియా ద్వీప కల్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 వారాల వ్యవధిలో ఇది మూడో పరీక్ష కాగా.. ఈ ఏడాది ఇది 12వ క్షిపణి పరీక్ష. మరిన్ని ఆంక్షలు విధించడంతో పాటు.. సైనిక చర్య తప్పదన్న అమెరికా హెచ్చరికలకు సమాధానంగానే తాజా పరీక్ష నిర్వహించినట్లు భావిస్తున్నారు.

ఉత్తరకొరియా సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల జరిగిన జీ7 సదస్సులో ట్రంప్‌ హామీ నేపథ్యంలో.. అమెరికాను రెచ్చగొట్టేందుకే  ప్రయోగం చేసి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. బాలిస్టిక్‌ క్షిపణుల ప్రయోగంతో రెచ్చగొడుతున్న ఉత్తర కొరియా.. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకే ఖండాతర క్షిపణి పరీక్ష కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ లోపే ఉ.కొరియాపై సైనిక చర్య జరపాలనే లక్ష్యంతో అమెరికా ఉన్నా.. జరగబోయే నష్టంపై ఆందోళనల నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.

తగిన జవాబిస్తాం: జపాన్‌
ఉ.కొరియా క్షిపణి పరీక్షను జపాన్‌ ప్రధాని షింజో అబే ఖండించారు. మిత్రపక్షం అమెరికాతో కలిసి తగిన సమాధానమిస్తామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజం పదే పదే హెచ్చరిస్తున్నా.. ఉత్తరకొరియా ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదన్నారు.

మరిన్ని వార్తలు