ట్రంప్‌నకు లేఖ రాసిన కిమ్‌!!

11 Sep, 2018 11:56 IST|Sakshi

త్వరలోనే మరోసారి భేటీ కానున్న ఉత్తర కొరియా, అమెరికా అధ్యక్షులు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌లు త్వరలోనే మరోసారి భేటీ కానున్నారని శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. అణు నిరాయుధీకరణ అంశంలో కిమ్‌ పూర్తి సానుకూల దృక్పథంతో ఉన్నారని శ్వేతసౌధ ప్రతినిధి సారా సాండర్స్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కిమ్‌ జాంగ్‌, ట్రంప్‌నకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. వాషింగ్టన్‌- ప్యాంగ్‌యాంగ్‌ల మధ్య బలపడుతున్న అనుబంధానికి కిమ్‌ లేఖ నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆదివారం(సెప్టెంబరు 9) జరిగిన ఉత్తర కొరియా స్వాతంత్య్ర వేడుకల్లో క్షిపణులు ప్రదర్శించని విషయాన్ని సాండర్స్‌ గుర్తు చేశారు. ట్రంప్‌ చొరవతోనే ఇది సాధ్యమైందని, అణు నిరాయుధీకరణ దిశగా చర్చలు జరగడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైందని వ్యాఖ్యానించారు. సమావేశానికి సంబంధించి మరో మూడు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సాండర్స్‌ పేర్కొన్నారు.

కిమ్‌ సానుకూలంగానే ఉన్నారు...
అణు నిరాయుధీకరణే లక్ష్యంగా జూన్‌ 12న సింగపూర్‌లో జరిగిన ట్రంప్‌, కిమ్‌ల చారిత్రాత్మక భేటీ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో ట్రంప్‌ ఆశించినట్లుగా అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా తమ దేశ భద్రతకు అమెరికా నుంచి కిమ్‌ హామీ పొందారు.

కాగా అణు నిరాయుధీకరణ అంశంలో పురోగతి సాధించే క్రమంలో భాగంగా.. జూలై 6న అమెరికా విదేశాంగ మంత్రి మైఖ్‌ పాంపియో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అమెరికా కన్నా చైనాతోనే సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉత్తర కొరియా ప్రాధాన్యం ఇస్తోందని భావించిన ట్రంప్‌.. చైనాతో నెలకొన్న సమస్యలు పరిష్కారమైన తర్వాతే పాంపియో అక్కడ పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అణు నిరాయుధీకరణ చర్చలు అటకెక్కినట్లేనని అంతా భావించారు. అయితే ప్రస్తుతం కిమ్‌ నుంచి ట్రంప్‌నకు లేఖ రావడంతో శ్వేతసౌధ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు