‘యూఎస్‌ స్థావరాల బద్దలుకే మా ప్రయత్నం​’

7 Mar, 2017 09:57 IST|Sakshi
‘యూఎస్‌ స్థావరాల బద్దలుకే మా ప్రయత్నం​’

టోక్యో: ఉత్తర కొరియా దుస్సాహాసానికి దిగబోతోంది. ఏకంగా ప్రపంచ అగ్ర రాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వబోతోంది. ఇటీవల వరుస క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం అవన్నీ కూడా తాము అమెరికాను లక్ష్యం చేసుకునే చేశామంటూ నేరుగా ప్రకటించింది. జపాన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలు ధ్వంసం చేసేందుకు తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామంటూ బహిరంగంగా మీడియాకు లీకులిచ్చింది.

అందులో భాగంగానే తమ అణు క్షిపణుల సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటూ వెళుతున్నామని కూడా ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పర్యవేక్షణలో ఆయన చూస్తుండగా నాలుగు బాలిస్టిక్‌ అణు ఖండాంతర క్షిపణులను పరీక్షించినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఎజెన్సీ తెలిపింది. తమ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాంతీయ సంరక్షణకు తాము క్షిపణుల సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు తెలిపిన ఉత్తర కొరియా తమ అసలు ఉద్దేశాన్ని మాత్రం బయటపెట్టింది.

జపాన్‌లోని అమెరికాకు చెందిన చాలా ముఖ్యమైన సైనిక స్థావరాలున్నాయి. గతంలో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన సైనిక స్థావరాలు ఏర్పాటుచేశారు. వీటిని ధ్వంసం చేసేందుకే ఉత్తర కొరియా ప్రయత్నిస్తోందంట. అదీ కాకుండా అమెరికా వ్యూహాత్మక కమాండ్‌ కూడా ఉత్తర కొరియా క్షిఫణి ప్రయోగాన్ని ట్రాక్‌ చేసిందట. అయితే, అది ఉత్తర అమెరికాకు లక్ష్యంగా చేసినట్లుగా అనిపించలేదని చెప్పింది.

మరిన్ని వార్తలు