మావో సూట్, మారిన హెయిర్‌స్టైల్‌

3 May, 2020 02:47 IST|Sakshi
రిబ్బన్‌ కట్‌చేసి ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్న కిమ్‌

ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్‌ సందడి

వీడియో, ఫొటోలు విడుదల చేసిన ఉ.కొరియా మీడియా

సియోల్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన  సంచోన్‌లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు ఆయన సోదరి జాంగ్‌ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

నవ్వుతూ కలియతిరుగుతూ..
ఉ. కొరియా విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు చూస్తే కిమ్‌ అనారోగ్యం బారిన పడినట్టు లేదు. నల్లని మావో సూట్‌ వేసుకొని, కొత్త హెయిర్‌ స్టైల్‌తో నవ్వుతూ కనిపించారు. తన సోదరి అందించిన కత్తెరతో రెడ్‌ రిబ్బన్‌ కట్‌ చేసి అందరి కరతాళ ధ్వనుల మధ్య ఫ్యాక్టరీని ప్రారంభించారు. పొగ పీలుస్తూ, అధికారులతో మాట్లాడుతూనే ఎరువుల ఫ్యాక్టరీలో కలియతిరిగారు. ఫ్యాక్టరీలో తిరిగేటపుడు ఊతకర్ర లేకుండా నడిచారు. 2014లో ఆయన కాలుకి సర్జరీ జరిగి కోలుకున్నాక కిమ్‌ గతంలో కొంతకాలంపాటు ఊతకర్ర సాయంతో నడిచారు. ఈ సారి నడుస్తున్నపుడు ఊతకర్ర సాయం తీసుకోలేదు. అయితే ఒక ఫొటోలో కిమ్‌ పక్కన ఉన్న అధికారి చేతిలో ఊతకర్ర ఉంది. ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి చూపించే చరిత్ర ఉ.కొరియాకు ఉండడంతో కిమ్‌ ఊతకర్ర లేకుండా నడుస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మాస్కులతో కార్మికులు..
ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన వేదికపై కిమ్, ఇతర అధికారులు కూర్చొని ఉండగా బెలూన్లు గాల్లో ఎగురవేసి మే 1న సంచోన్‌ ఫాస్ఫేటిక్‌ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం అయిందంటూ ప్రకటించారు. ఆ సమయంలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు ముఖానికి మాస్కులతో కనిపించారు. అంటే ఉ.కొరియాలోనూ కరోనా విజృంభిస్తోందని స్పష్టమవుతోంది. పార్టీలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే పాలిట్‌ బ్యూరోలోకి ఏప్రిల్‌ 11న తన సోదరిని నియమించాక కిమ్‌ బయట ప్రపంచానికి కనిపించలేదు. కిమ్‌ బాడీ గార్డుల్లో ఒకరికి కరోనా వైరస్‌ సోకిందని, అందుకే ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు