ఏ క్షణమైనా అణు యుద్ధం

18 Oct, 2017 01:36 IST|Sakshi

అమెరికా, దాని మిత్ర దేశాల్ని హెచ్చరించిన ఉత్తర కొరియా

న్యూయార్క్‌: ఏ క్షణమైనా అణు యుద్ధం జరగవచ్చంటూ ఉత్తర కొరియా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. తన దుందుడుకు చర్యలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ దేశం ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, దాని మిత్రదేశాల్ని గట్టిగా హెచ్చరించింది. అమెరికాతో కలిసి సైనిక చర్యలో పాల్గొనే దేశాలకు కూడా గట్టిగా బుద్ధిచెపుతామని పేర్కొంది. ఐరాసలో ఉత్తర కొరియా డిప్యూటీ అంబాసిడర్‌ కిమ్‌ ఇన్‌ ర్యాంగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐరాస జనరల్‌ అసెంబ్లీకి చెందిన నిరాయుధీకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఏక్షణం లోనైనా అణుయుద్ధం తలెత్తవచ్చు’ అని పేర్కొన్నారు. 1970 నుంచి ప్రపంచంలో అమెరికా నుంచి తీవ్రమైన అణుముప్పు ఎదుర్కొంటున్న దేశం ఉత్తర కొరియా ఒక్కటేనని, ఆత్మరక్షణ కోసం అణ్వాయు ధాలు కలిగిఉండే హక్కు తమ దేశానికి ఉందని ఆయన సమర్థించుకున్నారు. ‘ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా అణ్వాయుధాలతో ప్రతీ ఏటా అమెరికా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది.

మా అధినేత కిమ్‌ జోంగ్‌ ఇల్‌ను హత్య చేసేందుకు ఆ దేశం కుట్ర చేసింది’ అని అమెరికాను తప్పుపట్టారు. ఈ ఏడాదే ఉత్తర కొరియా పూర్తిస్థాయి అణ్వాయుధ సామర్థ్యం సాధిం చిందని, వివిధ దూరాల్లోని లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులతో పాటు, అణు బాంబు, హైడ్రోజన్‌ బాంబు తమ వద్ద ఉన్నాయని ర్యాంగ్‌ పేర్కొన్నారు.

అమెరికాను సర్వ నాశనం చేస్తాం
‘అమెరికా భూభాగం మొత్తం ఉత్తర కొరియా క్షిపణుల పరిధిలో ఉన్నాయి. ఒకవేళ మా దేశంపై యుద్ధానికి అమెరికా సాహసం చేస్తే ప్రపంచంలో ఆ దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా వదలకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు.  మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. మొదటి బాంబు జారవిడిచే వరకూ ఉ.కొరియా సంక్షోభం పరిష్కారానికి దౌత్య చర్చలు కొనసాగుతాయన్నారు.  

మరిన్ని వార్తలు