జాలిలేకుండా దాడిచేస్తాం.. అమెరికాకు వార్నింగ్‌!

14 Mar, 2017 11:48 IST|Sakshi
జాలిలేకుండా దాడిచేస్తాం.. అమెరికాకు వార్నింగ్‌!

సియోల్‌: తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా హెచ్చరించింది. వాయు, జల, భూమార్గాల ద్వారా జాలి లేకుండా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ అధికార న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది.

దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌లో భాగంగా నేవి సూపర్‌ క్యారియర్‌ 'కార్ల్ విన్సన్‌'ను యునైటెడ్‌ స్టేట్స్‌ మోహరిస్తున్న నేపథ్యంలో నార్త్ కొరియా ఈ విధంగా స్పందించింది. కార్ల్‌ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఉత్తరకొరియా మండి పడింది. మార్చ్ 11న సైతం శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని ఉత్తరకొరియా ఆరోపించింది. తమ దేశ ఆర్మీని టార్గెట్‌ చేయడం కోసమే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని కేసీఎన్‌ఏ పేర్కొంది. దక్షిణ కొరియాలో యాంటీ మిస్సైల్‌ సిస్టమ్‌ను మోహరించడం పట్ల అమెరికాపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు