కిమ్‌ బతికే ఉన్నాడు!

27 Apr, 2020 08:35 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల కథనాలు వెలువడుతున్న తరుణంలో దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్‌ చుంగ్‌ ఇన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కిమ్‌ బతికే ఉన్నారని, అతని ఆరోగ్యానికి ఢోకా లేదని ఆదివారం వెల్లడించారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది’ అని పేర్కొన్నారు. ఉత్తర కొరియాకు తూర్పు ఉన్నత ప్రాంతంలోని వాన్‌సన్‌లో కిమ్‌ ఏప్రిల్‌ 13 నుంచి ఉంటున్నట్టు చుంగ్‌ ఇన్‌ తెలిపారు. అతని ఆరోగ్యంపై గాని, మరే విషయాల్లో గాని ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని అన్నారు.
(చదవండి: ఆ రైలు అదే.. కిమ్‌ అక్కడే ఉండొచ్చు!)

కాగా, ఏప్రిల్‌ 11 జరిగిన తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్న కిమ్‌ పత్తా లేకుండా పోయారు. అయితే, ఫైటర్‌ జెట్‌ విమానాలను పరిశీలించేందు కిమ్‌ వెళ్లాడని ఆ దేశ మీడియా తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత ఇల్‌ సంగ్‌ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్‌ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 

గతంలో ఆరువారాలు పత్తాలేదు..
పొరుగునే ఉన్న దక్షిణ కొరియా మాత్రం కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని మొదటి నుంచి చెప్తూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలోని రిసార్ట్‌ టౌన్‌లో కిమ్‌ కుంటుంబ సభ్యులకు మాత్రమే సేవలందించే ప్రత్యేక ట్రైన్‌ ఏప్రిల్‌ 21, 23 తేదీల్లో కనిపించినట్టు ఉత్తర కొరియాలో పనిచేస్తున్న వాషింగ్టన్‌ బేస్డ్‌ పర్యవేక్షణ ప్రాజెక్ట్ (38 నార్త్‌) తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

శాటిలైట్‌ దృశ్యాల్లో లీడర్‌షిప్‌ స్టేషన్‌లో కిమ్‌ ఫ్యామిలీకి సేవలందించే ప్రత్యేక ట్రైన్‌ ఆచూకీ బయటపడిందని పేర్కొంది. ఆ రైలులో కిమ్‌ ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయడింది. ఒకవేళ కిమ్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేని పక్షంలో రైలు అక్కడ ఉండే అవకాశమే లేదని వెల్లడించింది. ఇక 2014లో కిమ్‌ ఆరువారాలపాటు కనిపించకుండా పోయారు. అతని కాలి మడమకు శస్త్ర చికిత్స జరిగిందని ఆదేశ గూఢచార సంస్థ తర్వాత తెలిపింది.

మరిన్ని వార్తలు