క్రిస్టియన్లకు చైనా ఆదేశాలు

15 Nov, 2017 11:18 IST|Sakshi

బీజింగ్‌ : ప్రభుత్వం పేదలకు అందించే ప్రయోజనాలు కావాలంటే ఇంట్లో గోడకు ఉన్న యేసుక్రీస్తు ఫొటోను తీసేసి.. ఆ స్థానంలో అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఫొటోను పెట్టుకోవాలంటూ దేశంలోని క్రిస్టియన్లకు చైనా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు చైనాలోని యుగాన్‌ కౌంటీలోని క్రిస్టియన్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు ‘యేసుక్రీస్తు మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తేలేరు. కేవలం చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. మిమ్మల్ని ధనికులుగా మార్చుతుంది. మీ అవసరాలను తీర్చగలుగుతుంది. 

కాబట్టి అందరూ మీ ఇళ్లలో ఉన్న యేసుక్రీస్తు ఫొటోలను తీసేసి.. జిన్‌ పింగ్‌ ఫొటోను ఆ స్థానంలో పెట్టండి.’ అని సూచనలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 11 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. అందులో సింహభాగం(10 శాతం) మంది క్రిస్టియన్లే. దీన్ని అదనుగా తీసుకున్న చైనా ప్రభుత్వం.. క్రిస్టియన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వారిని పేదరికం నుంచి బయటకు తెస్తామని, యేసుక్రీస్తు ఫొటోలను ఇళ్లలో నుంచి తొలగించి జిన​ పింగ్‌ ఫొటోలు పెట్టుకోవాలని కోరుతోంది.

ప్రభుత్వ ప్రతిపాదనతో ఇప్పటికే 624 క్రిస్టియన్‌ కుటుంబాలు ఇళ్లలో నుంచి జీసస్‌ ఫొటోలను తొలగించాయి. అందులో 453 కుటుంబాలు క్రీస్తు ఫొటోలను ఉంచిన స్థానంలో జిన్‌ పింగ్‌ ఫొటోలను పెట్టినట్లు చైనా పత్రికలు ప్రచురించాయి.

లక్ష్యం పేరుతో :
2020 కల్లా దేశంలో పేదరికాన్ని సమూలంగా అంతమొందించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందుకోసం చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నేతలు దేశవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగమే ఈ ఫొటోల మార్పిడి. క్త్రైస్తవ ప్రభావం ఎక్కువ కలిగిన ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నేతలు విస్తృతంగా తిరుగుతున్నారు. హ్వాన్‌జిబూ అనే ప్రాంతంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్వి యాన్‌ అనే నాయకుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుంచి ఈ పేదరిక నిర్మూలనకు క్రైస్తవ ప్రభావం కలిగిన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు.

కమ్యూనిస్టు పార్టీ పేదరికాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలను క్రైస్తవులకు వివరిస్తునట్లు తెలిపారు. ముఖ్యంగా జిన్‌ పింగ్‌ పేదరికంలో మగ్గుతున్న క్రిస్టియన్లను ధనికులుగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయం స్థానిక క్రిస్టియన్లకు అర్థం అయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫొటోల మార్పిడి దేనికి..
చైనా తొలి నాయకుడు మావో జెడాంగ్‌. ఆయన ఫొటో లేని ఇళ్లు దాదాపు చైనాలో ఎక్కడా కనిపించవు. అచ్చూ అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫొటో ఉండేలా చేయడానికి ‘పేదరికం’  అంశాన్ని జిన్‌ పింగ్‌ పావుగా వాడుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.  అంతేకాకుండా, మావో జెండాంగ్‌ తర్వాత అంతటి బలీయమైన నాయకుడిగా నిలదొక్కుకునేందుకు దేశంలోని గ్రామాలను జిన​ పింగ్‌ టార్గెట్‌ చేసుకున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.

మరిన్ని వార్తలు