వయసు 16 ఏళ్లు.. గవర్నర్‌ రేసులో

13 Aug, 2017 06:52 IST|Sakshi
వయసు 16 ఏళ్లు.. గవర్నర్‌ రేసులో

చికాగో, అమెరికా : అతడు ఓ హైస్కూల్‌ విద్యార్థి. వయసు పదహారేళ్లే.. కానీ, అప్పుడే అమెరికాలోని కాన్సాస్‌కు గవర్నర్‌ అయ్యేందుకు ప్రచారం ప్రారంభించి మొత్తం దేశాన్ని తనవైపు తిరిగి చూసేలా చేశాడు. అమెరికాలో గవర్నర్‌ అవ్వాలంటే కనీస వయసు సాధారణంగా 30గా పేర్కొంటారు. అయితే, కొన్ని రాష్ట్రాలకు మాత్రం 25, 21, 18 ఏళ్లు ఉండగా ఓక్లాహామాకు మాత్రం 31 కనీస వయసు ఉండాలి. అయితే, ఒక్క కాన్సాస్‌, వర్మోంట్‌కు మాత్రం స్పష్టంగా ఇంత వయసు ఉండాలని పేర్కొనలేదు.

వివరాల్లోకి వెళితే.. జాక్‌ బర్గ్‌సన్‌ అనే హైస్కూల్‌ విద్యార్థి 2018లో జరగనున్న కాన్సాస్‌ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరుపున బరిలోకి దిగుతుండగా ఇతడికి పోటీగా మరో హైస్కూల్‌ స్టూడెంట్‌ అలెగ్జాండర్‌ క్లైన్‌ బరిలోకి దిగుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరికి కూడా ఓటు హక్కు కూడా లేదు. గత బుధవారం ఏబీసీ నెట్‌ వర్క్‌లో ప్రచారమైన జిమ్మీ కిమ్మెల్‌ లైవ్‌ అనే కామెడీ కార్యక్రమంలో పాల్గొని జాక్‌ బర్గ్‌సన్‌ ఈ విషయాన్ని తెలిపాడు.

వచ్చే ఏడాది ఈ ఇద్దరు విద్యార్థుల స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తవనుంది. కాన్సాస్‌కు గవర్నర్‌గా పోటీ చేసే వ్యక్తికి ఎంత వయసు ఉండాలనే విషయంలో ప్రత్యేక నిబంధనలు లేని కారణంగానే వీరిద్దరు పోటీలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే జాక్‌కు నిధులు కూడా వస్తున్నాయంట. 1300 డాలర్ల ఫండ్‌ అప్పుడే తనకు చేరినట్లు జాక్‌ తెలిపాడు. యువకులను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని తాము గ్రహించామని, అయితే, కాన్సాస్‌ ప్రజలు ఇక మూసదోరణి రాజకీయాలను ఏమాత్రం భరించబోరని తమతోనే మార్పును ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించాడు.

మరిన్ని వార్తలు