నోటర్‌–డామ్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం 

17 Apr, 2019 02:39 IST|Sakshi

దేశ, విదేశాల నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు

పారిస్‌: ప్రఖ్యాత నోటర్‌–డామ్‌ కేథడ్రల్‌లో అగ్ని ప్రమాదంపై ఫ్రాన్సు ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు. దాదాపు 15 గంటలపాటు శ్రమించిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఒక వైపు ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుండగా ఈ చారిత్రక కట్టడాన్ని పునర్నిర్మించేందుకు రూ.4వేల కోట్ల మేర సాయం అందజేస్తామంటూ ఫ్రాన్సుతోపాటు ఇతర దేశాల నుంచి కూడా దాతలు ముందుకువచ్చారు. ఈ ఘటన చాలా విచారకరమంటూ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 పేర్కొనగా, నోటర్‌–డామ్‌ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఫ్రాన్సు వ్యాప్తంగా బుధవారం రాత్రి 6.50 గంటలకు అన్ని కేథడ్రల్‌లలో గంటలు మోగించాలని నిర్ణయించారు. 

ప్రమాదం తీవ్రత..
 సోమవారం నాటి మంటల్లో కేథడ్రల్‌ పైకప్పు పూర్తిగా కాలి కూలిపోయింది. పెద్ద సంఖ్యలో సంఖ్యలో చిత్రాలు, కళాఖండాలు బూడిదయ్యాయి. దాదాపు 8 వేల పైపులతో కూడిన ఆర్గాన్‌ అనే భారీ సంగీత పరికరం కూడా బాగా దెబ్బతింది. అయితే, ఏసుక్రీస్తును శిలువ వేసిన సమయంలో ధరించినట్లుగా భావిస్తున్న ముళ్ల కిరీటం ‘ది హోలీ క్రౌన్‌ ఆఫ్‌ థోర్న్‌’ తదితరాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చర్చి గోడలు, గంట గోపురం, ప్రసిద్ధ గాజు కిటికీలు చెక్కుచెదరలేదు. చర్చిలో మంటలను ఆర్పేందుకు 400 మంది ఫైర్‌ సిబ్బంది 15 గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. 

మంటలకు కారణం.. 
850 ఏళ్లనాటి ఈ కట్టడంలో ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 2022 నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సిబ్బంది సీసం పూతను తొలగిస్తుండగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఈ పనుల్లో పాల్గొన్న ఐదు నిర్మాణ కంపెనీల సిబ్బందిని 50 మందితో కూడిన అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. చర్చిలో మంటల వెనుక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పర్యాటకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  
దాతలు..విరాళాలు..: సోమవారం రాత్రి ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ప్రజాభీష్టం మేరకు నోటర్‌–డామ్‌ను పునర్నిర్మిస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను అందజేయాలని ఆయన కోరిన కొద్ది గంటల్లోనే ఫ్రాన్సుతోపాటు జర్మనీ, ఇటలీ, రష్యా నుంచి పలువురు ముందుకు వచ్చారు.  ఫ్రాన్సు కోటీశ్వరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్, అతని ఎల్వీఎంహెచ్‌ కంపెనీ, కెరింగ్, టోట్‌ ఆయిల్, లోరియల్‌ కంపెనీలు తలా రూ.780 కోట్ల మేర అందిస్తామని ప్రకటించాయి. విరాళాల కోసం ప్రత్యేకంగా ఫ్రెంచి హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా www.fondation&patrimoine.org వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేథడ్రల్‌ను ఏటా 1.30 కోట్ల మంది సందర్శించుకుంటారు.

మరిన్ని వార్తలు