నేపాల్ రైలు.. బీహార్ వరకు!

24 May, 2016 18:17 IST|Sakshi

బీజింగ్ః ఇప్పటికే టిబెట్ ద్వారా తన రోడ్ అండ్ రైల్వే నెట్వర్క్ ను నేపాల్ వరకు విస్తరించిన చైనా ఇప్పుడు భారత దేశంపై దృష్టి సారించింది. భారత్ తో వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నంలో భాగంగా  రైల్ లింకును ఇండియాలోని బీహార్ వరకూ పొడిగించేందుకు  చైనా ఆలోచన చేస్తోంది.

నేపాల్ కొత్త రాజ్యాంగం ప్రభావంతో భారత్ నేపాల్ కు సరకు రవాణా నిలిపేసింది. ఈ నేపథ్యంలో చైనాతో నేపాల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే చైనానుంచి నేపాల్ వరకు రైల్, రోడ్డు నిర్మాణాలకు సన్నాహాలు చేస్తోంది. చైనా రైల్ రోడ్ నిర్మాణం 2020 నాటికి నేపాల్ సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఆ దేశ అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక  ప్రచురించింది.  ఈ కొత్త రైల్వే లైన్ చైనా నుంచి భారత్ కు కలిపేందుకు కేవలం 240 కిలోమీటర్లు అంటే... రసువగధి నుంచి బిర్ గంజ్ వరకు  నిర్మిస్తే సరిపోతుందని కూడ వెల్లడించింది. రైల్ లింక్ వల్ల బీహార్ కు చైనాతో వాణిజ్యం సులభం అవుతుందని, కలకత్తా ద్వారా జరిపేకంటే ఈ మార్గం ద్వారా వాణిజ్యం సులభం కావడంతోపాటు దూరం, ఖర్చు కూడ కలసి వస్తుందని పత్రికా కథనంలో తెలిపింది.

చైనా రైల్ రోడ్ కనెక్షన్ వల్ల నేపాల్, నేపాలీ ప్రజల అభివృద్ధి మాత్రమే కాదని, దక్షిణాసియా మొత్తాన్ని అనుసంధానం చేయడంతోపాటు, నేపాల్ ప్రభుత్వం చరిత్ర సృష్టించే అవకాశం ఉందని కథనం వెల్లడించింది. ఇందుకు నేపాలీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని చైనా అభిప్రాయపడుతోంది.

మరిన్ని వార్తలు