అక్టోబర్‌-నవంబరులో యుద్ధం ఖాయం, ఇదే చివరిది కూడా!

28 Aug, 2019 18:15 IST|Sakshi

పాక్‌ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు 

ఇస్లామాబాద్‌: దాయాది దేశాల మధ్య ఒక వైపు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే పాకిస్తాన్‌ పదే పదే కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌-భారత్‌ మధ్య అక్టోబర్‌-నవంబర్‌ మధ్య  యుద్ధం రానుందంటూ వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్ర్య యుద్ధం జరగనుందంటూ ప్రమాదకర వ్యాఖ్యలు చేసారు.

రావల్పిండిలో బుధవారం మీడియాను ఉద్దేశించి షేక్ రషీద్ మాట్లాడుతూ "కశ్మీర్ తుది స్వాతంత్ర్య పోరాటానికి సమయం ఆసన్నమైంది" పేర్కొన్నారు. అంతేకాదు భారత్, పాకిస్తాన్ మధ్య  ఇప్పటికే  పది యుద్ధాలు జరిగాయి.. కానీ ఇదే చివరి యుద్ధమని కూడా ప్రకటించారు. పనిలో పనిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అనాగరిక, ఫాసిస్ట్ నరేంద్ర మోదీనే కశ్మీర్ విధ్వంసానికి కారణమని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ మాత్రమే మోదీ కళ్లముందు కనిపిస్తోందనీ, ఈ సమస్యపై మిగతా ముస్లిం ప్రపంచం ఎందుకు మౌనంగా ఉందని షేక్ రషీద్ ప్రశ్నించారు.

కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించలేదని పేర్కొన్న ఆయన ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపు నిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) ఈ సమస్యను నిజంగా పరిష్కరించాలనుకుంటే ఇప్పటికే కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగేదని వ్యాఖ్యానించారు. తమ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో మరోసారి ఐరాస సర్వసభ్య సమావేశానికి తీసుకువెళతారన్నారు. (చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ)

Poll
Loading...
మరిన్ని వార్తలు