హిరోషిమాకు అణుబాంబు ఫొటోలు

19 May, 2016 22:15 IST|Sakshi

వాషింగ్టన్: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌పై విసిరిన అణుబాంబుల తాలూకు చిత్రాలను ఆ దేశానికి ఇవ్వడానికి అమెరికా నిర్ణయించింది. 1945 ఆగస్టు 6,9 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత సైనిక ఉన్నతాధికారి లెస్లీ గ్రోవ్స్ వాషింగ్టన్‌లో పభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై జరిగిన విధ్వంసాన్ని వివరించారు. అపుడు ఆయన వెంట బాంబుల జారవిడిచినప్పటి ఛాయా చిత్రాలు ఉన్నాయి. వాషింగ్టన్ మేధావి బృందం స్టిమ్సన్ సెంటర్ సహవ్యవస్థాపకుడు మైఖేల్ క్రెపాన్ ఆ చిత్రాలనే ఏఎఫ్‌పీకి చూపించినట్లు వెల్లడించారు.

సుమారు 20 చిత్రాలు 1990 నుంచి ఈ సంస్థ వద్దే ఉంటున్నాయి. వీటిని హిరోషిమా శాంతి స్మారక మ్యూజియానికి కానుకగా ఇవ్వాలని క్రెపాన్ గతేడాది నిర్ణయించారు. ఈ ఫోటోలను ఎలా ప్రదర్శిస్తారన్న దానిపై చర్చలు జరిపిన తరువాత 'కొద్ది రోజుల్లో జపాన్ పంపిస్తాం. స్టిమ్సన్ సెంటర్‌లో అయితే వీటిని ఎక్కువ మంది చూడలేరు' అని అన్నారు. మే 27న అమెరికా అధ్యక్షుడు ఒబామా హిరోషిమా సందర్శించి అక్కడి శాంతి స్మారక మ్యూజియంలో నివాళులు అర్పిస్తారు. లిటిల్‌బాయ్ పేరుతో విసిరిన అణుబాంబు హిరోషిమాలో లక్షా నలభై వేల మందిని బలితీసుకుంది.

మరిన్ని వార్తలు