క్షేమంగా తిరిగి వచ్చిన జగిత్యాలవాసులు

22 Apr, 2019 03:24 IST|Sakshi
క్షేమంగా బయటపడ్డ కొలంబోలో కోరుట్ల వాసులు

బాంబు పేలిన హోటల్‌కు పక్కనే 14 మంది 

పేలుడుకు ముందు స్వదేశానికి పయనం

కోరుట్ల/మెట్‌పల్లి: శ్రీలంకలోని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాలకు చెందిన పలువురు త్రుటిలో తప్పించుకుని క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మెట్‌పల్లికి చెందిన ఏలేటి నరేందర్‌రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, కోరుట్లకు చెందిన బాశెట్టి కిషన్‌ దంపతులు సహా మొత్తం 14 మంది వారం క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం వారు ఈనెల 19న కొలంబో నగరానికి చేరుకుని నార్లేమెరీన్‌ అనే హోటల్‌లో బసచేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు వీరంతా స్వదేశానికి బయలుదేరగా, 8 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్‌ పక్కన ఉన్న మరో హోటల్‌లో ఉగ్రదాడి జరిగింది. దాడి జరగడానికి గంట ముందు అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత దాడి విషయం తెలుసుకున్న వారు ఉద్వేగానికి లోనయ్యారు. పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుతీకోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

‘అనంత’వాసులకు గాయాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీలంకలో బాంబుపేలుళ్ల ఘటనలో అనంతపురం వాసులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని అమిలినేని సురేంద్రబాబు, ఆయన స్నేహితుడు భక్తవత్సలం గాయపడగా, సురేంద్ర మరో స్నేహితుడు రాజగోపాల్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ముగ్గురూ వ్యక్తిగత పనిమీద కొలంబో వెళ్లి షాంగ్రీ లా హోట్‌లో బసచేశారు. హోటల్‌లోని రెస్టారెంట్‌లో అల్పాహారం తింటుండగా ఒక్కసారిగా పెద్దపేలుడుతో రెస్టారెంట్‌ అద్దాలు ధ్వంసమై సురేంద్ర ముఖంపై పడడంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే భక్తవత్సలం కాలికి గాయాలయ్యాయి. వీరిని హోటల్‌ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వీరు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారు.
 

మరిన్ని వార్తలు