కరకు తగ్గని ఒబామా

7 Nov, 2014 01:26 IST|Sakshi
కరకు తగ్గని ఒబామా

* రిపబ్లికన్లతో కలసి పనిచేసినా, కాంగ్రెస్‌నూ పట్టించుకోనని స్పష్టీకరణ
* కొత్త పరిణామాల నేపథ్యంలో తన ఎజెండా మారబోదని వ్యాఖ్య
* మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల వైఫల్యం నేపథ్యంలో వ్యాఖ్యలు

 
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల స్థానాలకు, పలు రాష్ట్రాల గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ చేతిలో పాలకపక్షం డెమోక్రాటిక్ పార్టీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఒకింత తిరస్కార వైఖరితోనే స్పందించారు.  రాబోయే తన రెండేళ్ల పాలనలో రిపబ్లికన్లతో కలసి పనిచేస్తానని, అయితే 2.4 లక్షలమంది భారతీయులు సహా, కోటీ పది లక్షల మంది అక్రమ వలసదార్లు అమెరికాలోనే కొనసాగేందుకు దోహదపడే వలస సంస్కరణల వంటి అంశాల్లో మాత్రం తాను కాంగ్రెస్‌ను పట్టించుకోనని ,  కార్యవర్గపరంగా తనకున్న అధికారాలను  వినియోగిస్తానని స్పష్టం చేశారు.

ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త పరిణామాల నేపథ్యంలో తన ఎజెండాలోనూ ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. వైట్‌హౌస్‌లో దాదాపు 90 నిమిషాలసేపు సాగిన విలేకరుల సమావేశంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో ప్రజాహితం కోసం కష్టపడి పనిచేస్తానంటూ అమెరికన్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలోనూ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో, బహిరంగ లేఖలో ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

దేశంలో 2.4 లక్షలమంది భారతీయులు సహా కోటీ 10 లక్షలమంది అక్రమ వలసదారులున్నారు. వలస విధానంలో సమగ్రమైన సంస్కరణల ద్వారానే అమెరికాలో నివసించే వారికి తగిన అవకాశాలు లభిస్తాయి. వలసలపై సమగ్ర వ్యవస్థ పనితీరు మెరుగుపడేలా ఈ ఏడాదిలోగా చర్యలు తీసుకుంటాం.

వాణిజ్య ఒప్పందాలు, మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం, వలస విధానాల ప్రక్షాళన వంటి అంశాల్లో రాజీ కుదుర్చుకునేందుకు యత్నిస్తా.

పరిపాలనలో వివిధ అంశాల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయమై, సెనేట్ మెజారిటీ నేత కాబోతున్న మిచ్ మెకెన్నెల్‌తో, ప్రతినిధుల సభ స్పీకర్ కాబోతున్న జాన్ బోయెనర్‌తో సహా ఇతర రిపబ్లికన్, డెమోక్రాటిక్  నేతలతో చర్చిస్తా.

తాజా ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిచారు. అయితే, వారంతా నాతో కలసి పనిచేయాలంటూ ప్రజలు తీర్పిచ్చారు.

మరిన్ని వార్తలు