ఆర్లెండోలో పర్యటించనున్న ఒబామా

14 Jun, 2016 10:29 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైట్హౌస్ ఓ ప్రకటన చేసింది.  ఆర్లెండో నగరంలో ఆదివారం తెల్లవారుజామున నైట్ క్లబ్లో జరిగిన నరమేధంలో 49మంది మృతి చెందగా, సుమారు 50మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో మృతి చెందినవారికి సంతాపంతో పాటు, వారి కుటుంబాలను ఒబామా పరామర్శించనున్నారు.  ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒబామా విస్కాన్సిన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా ఆయన వచ్చేవారం న్యూ మెక్సికో, కాలిఫోర్నియాలోని ఎన్నికల క్యాంపెన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిపై వైట్హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాల్పుల నేపథ్యంలో ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ఆర్లెండో ఉగ్రఘటనకు పాల్పడిన ఉగ్రవాది మతిన్ ఐసిస్ సభ్యుడు కాదని.. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న ఐసిస్ ఉగ్ర సాహిత్యంతో ప్రభావితుడై ఈ ఘటనకు పాల్పడ్డాడని ఒబామా వెల్లడించారు. ఈ ఘటన దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాద ఉన్మాదానికి ఉదాహరణ అని అన్నారు.


 

మరిన్ని వార్తలు