బాలుడి గొంతులో ఆక్టోపస్

11 Apr, 2016 10:18 IST|Sakshi

హోస్టన్: రెండేళ్లు కూడా నిండని బాలుడి గొంతులో నుంచి వైద్యులు ఓ ఆక్టోపస్‌ను బయటకు తీశారు. అంతచిన్న పిల్లాడి గొంతులోకి ఆక్టోపస్ ఎలా వెళ్లిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పిల్లాడిని చంపేందుకే ఎవరైనా కుట్ర పన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన అమెరికాలోని విచితా నగరానికి సమీపంలోగల కాన్సాస్ గ్రామంలో చోటుచేసుకుంది. తల్లి ఆఫీస్ నుంచి తిరిగొచ్చేసరికి ఆమె ప్రియుడు మ్యాథ్యూ పిల్లాడికి కృత్రిమంగా శ్వాస అందించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని గమనించి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. కృత్రిమ శ్వాసను అందించేందుకు వైద్యులు కూడా ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు.

బయటకు తీసిచూస్తే ఆక్టోపస్! దాని తలే దాదాపు 5 సెంటీమీటర్లుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ అందని కారణంగా మెదడుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు మ్యాథ్యూను అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు