అది ఆమె ప్రియుడి పనేనా!

10 Apr, 2016 17:27 IST|Sakshi
అది ఆమె ప్రియుడి పనేనా!

హ్యూస్టన్: అమెరికాలో ఓ రెండేళ్ల బాలుడి గొంతులో ఇరుక్కుపోయిన చనిపోయిన ఆక్టోపస్ను డాక్టర్లు అతికష్టం మీద బయటకు తీసి అతని ప్రాణాలను కాపాడారు. అయితే బాలుడి గొంతులోకి ఐదు సెంటీమీటర్ల వ్యాసానికి పైగా ఉన్న ఆ ఆక్టోపస్ ఎలా ప్రవేశించిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడి తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హ్యూస్టన్ ప్రాంతానికి చెందిన కన్సాస్ అనే 21 ఏళ్ల యువతి తన బాయ్ ఫ్రెండ్ మ్యాథ్యూ గల్లాగర్తో సహజీవనం చేస్తోంది. ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోన్న కన్సాస్.. తన రెండేళ్ల కొడుకుని బాయ్ ఫ్రెండ్ సంరక్షణలో వదిలేసి ఆఫీసుకు వెళ్లింది. అయితే.. ఆఫీసు నుంచి తిరిగొచ్చే సరికి తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి కన్సాస్ షాక్కు గురైంది. కొడుకు ఊపిరాడని స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పరిశీలించి బాలుడి గొంతులో ఆక్టోపస్ ఇరుక్కుపోయిందనే ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు.

ఊపిరాడకపోవడంతో మెదడుకు ఆక్సీజన్ సరఫరా తగ్గి.. బాలుడి ఆరోగ్యపరిస్థతి విషమంగా ఉండటంతో డాక్టర్లు ఆ ఆక్టోపస్ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు.. ఆ ఆక్టోపస్ను కన్సాస్ కుటుంబం పెంపుడు జంతువులా పెంచుకోవడం లేదని, ఆ సముద్రజీవి బాలుడి గొంతులోకి ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందని తెలిపారు. బాలల హక్కుల చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కన్సాస్ ప్రియుడు గల్లాగస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు