జెరూసలేం పాలస్తీనాదే..!

14 Dec, 2017 02:03 IST|Sakshi

అంతర్జాతీయ సమాజానికి ఇస్లాం దేశాల స్పష్టీకరణ

ట్రంప్‌ నిర్ణయంపై ముప్పేట దాడి

శాంతి ప్రక్రియలో అమెరికాకు పాత్ర లేదు: అబ్బాస్‌

ఇస్తాంబుల్‌: ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు ప్రపంచానికి పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ బుధవారం నిర్వహించిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కార్పొరేషన్‌(ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొన్న ఆ డిక్లరేషన్‌లో ‘ ఇజ్రాయెల్‌ అధీనంలోని తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరుతున్నాం’ అని అన్నారు.

జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, అది శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియలో అమెరికా పాత్రను ఇకపై తమ ప్రజలు అంగీకరించబోరని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌  స్పష్టం చేశారు.  తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను ఇకపై ఐక్యరాజ్య సమితి చేపట్టాలని, అమెరికా ఆ అర్హత కోల్పోయిందన్నారు. జెరూసలేంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఉగ్రదేశమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు