కాలగర్భంలోకి మానవ తొలిజాతి సంస్కృతి

31 May, 2016 14:34 IST|Sakshi
కాలగర్భంలోకి మానవ తొలిజాతి సంస్కృతి

లండన్: తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో ఆదిమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం కష్టమే! దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న మానవ జాతి పూర్వికుల సంస్కృతి, సంప్రదాయాలు ఈ తరానికే కాకుండా భవిష్యత్తులో మరే తరానికి తెలియకుండా కాలగర్భంలో కలసిపోయే ప్రమాదం ఏర్పడింది. శ్యాన్ తెగగా పిలిచే వీరే మానవ తొలి జాతి వారసులని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నిపుణులు తేల్చారు. వీరు 20 వేల ఏళ్ల కిందటి నుంచే దక్షిణాఫ్రికా అటవి ప్రాంతంలో నివసిస్తున్నారు.

వీరు దక్షిణాఫ్రికా నుంచి బోట్స్‌వానా, అంగోలా, నమీబియా వరకు విస్తరించి ఉన్నారు. బోట్స్‌వానాలో వీరిని బసర్వాలని పిలుస్తారు. వీరు సంచార జీవితమే ఎక్కువగా గడుపుతారు. బోట్స్‌వానా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని అక్కడి ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. వారికి పునరావాసం కల్పిస్తోంది. ఆధునిక ఆరోగ్య వసతులతోపాటు పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. దీంతో వారి సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా మారిపోనున్నాయి. శ్యాన్ తెగ పిల్లలు ఇంగ్లీషు చదువులు నేర్చుకుంటే క్రమంగా మారి ఆదిమ భాష కనుమరుగై పోతుంది. ఇప్పటికే వారి నృత్య రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి సంప్రదాయ కళలు కూడా నశించి పోతున్నాయి.

ఎంతో మంది చరిత్రకారులు, కళాకారులు ఆదిమ జాతుల కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఆదిమ జాతుల సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగయ్యాయి. ఎప్పటికో ఓ నాటికి అంతరించిపోయే సంస్కృతిని మనం క్రియాశీలకమని గుర్తించాలని, అప్పుడే అది ఏదో రూపంలో బతికి ఉంటుందని లండన్‌లోని బోట్స్‌వానా హై కమిషన్‌లో పనిచేసిన బిహేలా సెకిరే వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు