ఈ బామ్మ ఆయుష్షు గట్టిదే..!

6 Aug, 2017 00:09 IST|Sakshi
ఈ బామ్మ ఆయుష్షు గట్టిదే..!
ఆయుష్షు గట్టిగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడి బతుకుతారు. అదే లేకపోతే ఏ కారణం లేకుండానే కన్నుమూస్తారు. ఇలాంటి సంఘటనల గురించి రోజూ పేపర్లో మనం చదువుతూనే ఉంటాం. ఇక్కడ మనం చెప్పుకోబోతున్న బామ్మ ఆయుష్షు కూడా గట్టిదే. ఎందుకంటే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన ఈ బామ్మ ఏకంగా 80 కిలోమీటర్లపాటు కొట్టుకుపోయి, 13 గంటల తర్వాత సురక్షితంగా బయటపడింది. పశ్చిమబెంగాల్‌ను ప్రస్తుతం వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే దాదాపు 30 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఉప్పొంగుతున్న నదులు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతున్నాయి.

మహోగ్రంగా ప్రవహిస్తున్న దామోదర్‌ నది బుర్‌ద్వన్‌ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. కాళీబజార్‌కు పెద్దగా వరద ముప్పు లేకపోయినా.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 62 ఏళ్ల తపతి చౌదరీ, సమీపంలోనే ఉన్న నదీ ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లింది. ప్రవాహాన్ని చూస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. చూస్తుండగానే కొట్టుకుపోయింది. దీంతో అంతా ఆమెమీద ఆశలు వదులుకున్నారు. అలా కొట్టుకుపోయిన తపతి దాదాపు 13 గంటలపాటు మృత్యువుతో పోరాడింది.

80 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ప్రవాహం కాస్త నెమ్మదించడంతో తనను రక్షించాలంటూ ఆమె పెట్టిన కేకలు విన్న జాలర్లు ఆమెను రక్షించారు. కాసేపు సపర్యలు చేసిన తర్వాత కోలుకున్న తపతిని ప్రశ్నించడంతో.. తాను మర్కుందా ఘాట్‌కు సమీప నివాసినని, ప్రమాదవశాత్తు నదిలో పడ్డానని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతం ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పడంతో ఈసారి ఆశ్చర్యపోవడం తపతి చౌదరీ వంతైంది. ఎందుకంటే తాను అంతదూరం కొట్టుకొచ్చిన విషయం బామ్మ కూడా గుర్తించలేకపోయింది. 
మరిన్ని వార్తలు