ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్..!

29 Oct, 2015 16:56 IST|Sakshi
ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్..!

న్యూయార్క్: ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్ అని అంటుంటాం. కానీ వృద్ధులు, వయసు పైబడిన వారంటే సాధారణంగా అందరికీ చిన్నచూపు. ఓ ముద్ద తిని మూల పడుండక ఇంకా ఎందుకో ఆరాటం అని అన్ని ఇళ్లల్లో వారిపై కేకలు పెడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఓ రకంగా వారు ఇక ఏ విధంగాను ఉపయోగపడరు అని భావించేవారు లేకపోలేరు. అయితే, ఇదే అంశాన్ని సీరియస్గా తీసుకుని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యయనకారులు వయసులో పైబడిన వారి శక్తిసామర్థ్యాలను శోధించారు. ఈ శోధనలో పెద్దవారైపోయాక కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపరని ఇన్నాళ్లు వారిపై ఉన్న అపవాదు పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమైంది.

సాధారణంగా నేటి యువతరం కన్నా ఎక్కువగా పెద్దవారే కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని, దీంతోపాటు తాము చేసిన పొరపాట్లను వెంటనే గుర్తించి తమను తాము సంస్కరించుకోవడంలో కూడా నేటి యువతరం కన్నా ముందుంటారని కొలంబియా వర్సిటీ అధ్యయనకారులు తేల్చారు. ఇన్నాళ్లు సరైన వాస్తవాలు తెలియకుండానే వయసు మళ్లినవారిపై పూర్తి వ్యతిరేక ప్రచారం జరిగిందని వర్సిటీ సైకలాజికల్ సైంటిస్ట్ జానెట్ మెట్ కాఫ్ తెలిపారు.

ఈ అధ్యయనం కోసం 24 ఏళ్ల లోపున్న 44మంది యువకులను తీసుకోగా 74 ఏళ్ల వయసుగలవారిని 45మందిని తీసుకున్నారు. ఇందులో పలు కొత్త అంశాలను తయారు చేసి వారికి సమాన స్థాయిలో అందించి ప్రశ్నించగా యువకుల కంటే మెరుగైన ఫలితాలను ఆ వృద్ధులు కనబరచడమే కాకుండా తాము చేసిన పొరపాట్లను కూడా అప్పటికప్పుడే గుర్తించి అధ్యయనకారులను ఆశ్చర్యపరిచారు. 'సత్యం కోసం పెద్దవారు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి తప్పు చేయాలని అస్సలు అనిపించదు. సరైన దానిని ఎంచుకునేందుకు వారు ఎంతో శ్రద్ధ కనబరుస్తారు' అని మెట్ కాఫ్ వివరించారు.

మరిన్ని వార్తలు