ఒలింపిక్స్-ఫ్లాష్‌బ్యాక్..

26 Aug, 2016 20:31 IST|Sakshi
ఒలింపిక్స్-ఫ్లాష్‌బ్యాక్..

కారు.. పతకం బేకారు..
1904 ఒలింపిక్స్‌లో మారథాన్‌లో పాల్గొన్న క్రీడాకారులు వీరు. ఇందులో 31వ నంబరు బనియన్ వేసుకున్న ఫ్రెడ్రిక్ లార్జ్ ఈ పోటీలో గెలిచాడు. అయితే.. అతడిని తర్వాత అనర్హుడిగా ప్రకటించారు. ఎందుకో తెలుసా? సగం దూరం పరిగెత్తకుండా.. కారులో లిఫ్ట్ అడిగి వచ్చేశాడట. తర్వాత బాగా పరిగెత్తినట్లు పోజిచ్చి.. ప్రైజు కొట్టేశాడట. దీంతో 20వ నంబరు బనియన్ వేసుకున్న థామస్ హిక్స్‌ను విజేతగా ప్రకటించారు. ఈయన ఏం చేశాడో తెలుసా? పరిగెత్తినంత సేపూ అలా బ్రాందీ తాగుతూనే ఉన్నాడట.
 
హెల్ప్ కావాలా.. నాయనా..
1908 ఒలింపిక్స్‌లోని సీన్ ఇది. ఇటలీకి చెందిన రన్నర్ డొర్నాడో మారథాన్‌లో ఒకటికి పదిసార్లు కింద పడిపోయాడు. ఓసారైతే రివర్స్‌లో పరిగెత్తాడు. దీంతో కొందరు ఒలింపిక్స్ అధికారులు ‘దయ’తో సాయం కావాలా నాయనా.. అంటూ దగ్గరుండి మరీ.. ఇలా విజయం సాధించేలా చేశారు. తర్వాత డొర్నాడోను అనర్హుడిగా ప్రకటించినా.. రేసును పూర్తి చేసినందుకు కన్సొలేషన్ ప్రైజును ఇచ్చారు.
 
సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా..
ఒలింపిక్స్ అంటే..  ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ఈ ఫొటో చూడండి.. క్రీడాకారులు తమ బట్టలను తామే ఉతుక్కుని ఆరేసుకుంటున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్ పరిస్థితి ఇదీ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఇలాంటి ఆదా చర్యలు చేపట్టారు. అంతేకాదు.. ఎవరి టవల్స్ వారే తెచ్చుకోవాలని చెప్పారట. కొందరైతే.. తమ ఆహారం తామే తెచ్చుకున్నారట. ఇప్పటి లెక్కల ప్రకారం చూసినా.. ఆ ఒలింపిక్స్ కోసం బ్రిటన్ పెట్టిన ఖర్చు రూ.6.39 కోట్లు మాత్రమే.

జనం.. జంప్..
 ఇది 1908 లండన్ ఒలింపిక్స్‌లోని సీన్. స్వీడన్‌కు చెందిన క్రీడాకారిణి హైజంప్ చేస్తోంది..  జంప్ చేయాల్సినంత హైటు అక్కడ లేదన్న సంగతిని పక్కనపెడితే.. వెనుక చూశారా గ్యాలరీలో..  జనం కనిపిస్తే ఒట్టు. జనం లేకున్నా.. మన పని మనం చేసుకుందాం అన్నట్లు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

దూకుడు.. లాగుడు..
 1904లో అమెరికాలో జరిగిన ఒలింపిక్స్‌లోని సన్నివేశాలివీ.. అప్పటి ఒలింపిక్స్‌లో ఇలా బ్యారెల్ జంపింగ్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉండేవి. అంటే దూకుడు.. లాగుడు అన్నమాట. 1900 ప్యారిస్ ఒలింపిక్స్‌లో అయితే షూటింగ్ కోసం నిజమైన పావురాలను వాడారు.

గోల్డెన్ లెగ్గు
ఇతడు అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ జార్జ్ ఈజర్ 1904  ఒలింపిక్స్ లో పోల్గోన్నాడు.అయితే..ఇక్కడో ట్విస్టుంది...ఇతడు వికలాంగుడు .చెక్క కాలు పెట్టుకుని పోటీల్లో పోల్గోన్న జార్జ్  ఏకంగా ఆరు పతకాలు గెలుచుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు