మతిమరపు భర్తతో ఆమెకు మళ్లీ పెళ్లి

21 Aug, 2019 19:06 IST|Sakshi

ఆయన డిమెన్షియా, ఆమెకు వరమయింది. నూరేళ్ల జీవితాన్ని మళ్లీ ఇచ్చింది. ఆమె ఆనందానికి అంతు లేదు. ఆమె తన ఆనందాన్ని ‘ఫేస్‌బుక్‌’ మిత్రులతో పంచుకోవడంతో అది ప్రపంచానికి తెలిసిపోయింది. ఆమె స్కాట్‌లాండ్‌కు చెందిన అన్నే డంకన్‌. గత 12 ఏళ్ల క్రితం బిల్‌ అనే యుక్త వయస్కుడిని కాస్త లేటు వయస్సులోనే పెళ్లి చేసుకుంది. మూడేళ్లు వారి కాపురం అన్యోన్యంగానే సాగింది. ఆ తర్వాత అంటే తొమ్మిదేళ్ల క్రితం ఆయనకు డిమెన్షియా (మతిమరపు వ్యాధి) వచ్చింది. కలిసి ఉంటున్నా తన భార్యను గుర్తించలేక పోయారు. కనీసం ఆమె పేరు కూడా బిల్‌కు గుర్తులేదు. ఇదంతా అన్నే డంకన్‌కు ఏదో వెలితిగా, బాధగా ఉండేది.

ఒక రోజు అంటే, గత శుక్రవారం బిల్‌ హఠాత్తుగా తన భార్య అన్నే వద్దకు వచ్చి ‘నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?  నీతోనే నేను జీవితాంతం ఉండిపోతాను’ అన్నారట. దాంతో అన్నే అవాక్కయిందట. అయినా అనిర్వచనీయ ఆనందం వేసిందట. చెప్పిన మాటలు మళ్లీ మరచిపోతాడులే! అనుకుని ఆ తర్వాత నిట్టూర్చిందట. కానీ మరుసటి రోజు ‘మన పెళ్లి విషయం ఏం చేశావు ?’ అని ప్రశ్నించారట. అరే! నిన్నటి విషయాలు కూడా గుర్తున్నాయే అనుకుని అన్నేకు అమితానందం వేసిందట. వెంటనే ఎక్కడో ఉన్న కూతురు ఆండ్రియాకు ఫోన్‌ చేసి పెళ్లి కూతురు గౌన్‌ ఆర్డర్‌ చేసిందట. ఆ మరుసటి రోజు, ఆదివారం మధ్యాహ్నం కల్లా గౌన్‌ సిద్ధమయ్యిందట. సమీపంలోని కేఫ్‌ నుంచి కేకులు తెప్పించారట. ఆ రోజు సాయంత్రం ఇంటి వెనకనున్న గార్డెన్‌లో ‘పెళ్లి నాటి ప్రమాణాలతో’ మళ్లీ పెళ్లిచేసుకున్నారట. పరస్పరం పుష్ప గుచ్ఛాలు మార్చుకొని అభినందనలు తెలుపుకున్నారట. 

ఈ మళ్లీ పెళ్లి విషయాలను అన్నే తన ‘ఫేస్‌బుక్‌’ పేజీలో పోస్ట్‌ చేయడంతో ఎడతెరపి లేకుండా అభినందనలు, కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అదష్టమనే ఇదని, నిజమైన ప్రేమకు పెళ్లని, ఆహా గత జీవితం మరచిపోయి వద్ధాప్యం హాయిగా కలసి పోవడం ఎంత హాపీ అని ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొందరి మొదటిసారి పెళ్లి ఫొటోను కూడా పోస్ట్‌ చేయాల్సిందిగా కోరారు. అన్నే అలాగే చేసింది. కడపటి వార్తలు అందే వరకు ఆ భార్యా భర్తలిద్దరికి దాదాపు లక్ష వరకు గ్రీటింగ్స్‌ వచ్చినట్లు తెల్సింది. ఇప్పటికీ తన భర్త కొత్తగా పెళ్లి అయిన భ్రమలోనే ఉన్నారంటూ అన్నే మురిసిపోతోంది. అన్నే తన వయస్సునుగానీ, తన భర్త వయస్సునుగానీ ఎక్కడా వెల్లడించలేదు. అయినా వారిద్దరు 80 ఏళ్లు దాటినట్లే కనిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు