భగ్గుమన్న ఇస్లామాబాద్‌

26 Nov, 2017 02:38 IST|Sakshi

ఘర్షణల్లో ఒకరి మృతి

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పారా మిలటరీ దళాలు రంగం లోకి దిగడంతో ఈ హింస చెలరేగింది.

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన వేలాది మందిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. రోడ్లను ఖాళీ చేయించాలని ఇచ్చిన ఉత్తర్వుల అమలులో విఫలమయ్యారని పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రికి ఇస్లామాబాద్‌ హైకోర్టు ధిక్కార నోటీసుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ చేపట్టాయి.

పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారుల్ని మాత్రం ఖాళీ చేయించలేకపోయారు. పోలీసు చర్య నేపథ్యంలో అసాంఘిక శక్తులు చెలరేగకుండా.. పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రైవేట్‌ చానళ్ల ప్రసారాలతో పాటు ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా సైట్లను నిలిపివేసింది. ఆందోళనలు కరాచీ నగరానికి కూడా వ్యాపించాయి.  ఎన్నికల చట్టంలో మార్పులకు నిరసనగా పాక్‌న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని దాదాపు 2 వేల మంది ఆందోళనకారులు రెండు వారాల క్రితం ఇస్లామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ముర్రీ రోడ్డును దిగ్బంధించారు.

ఆత్మాహుతి దాడిలో నలుగురి మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్సులో భద్రతా బలగాల కాన్వాయ్‌ లక్ష్యంగా దుండగులు శనివారం జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఓ చిన్నారి సహా 19 మంది గాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు