భారత్‌పై మళ్లీ ఉగ్రదాడులు జరిపితే తీవ్ర చర్యలు: ట్రంప్‌

21 Mar, 2019 11:15 IST|Sakshi
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత్‌పై మళ్లీ ఉగ్రవాదులు దాడులు జరిపితే తీవ్ర చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారిన ప్రాంతాల (పాక్‌)పై సహనాన్ని ప్రదర్శించేదే ప్రసక్తే లేదన్నారు. భారత్‌లో ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా పాక్‌ తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’ అని వైట్‌హౌజ్‌కు చెందిన ఒక అధికారి బుధవారం మీడియాతో పేర్కొన్నారు.

‘పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్‌ గ్రూపులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడదు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్‌ సరైన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా జైష్‌-ఏ-మహ్మద్‌, లష్కర్‌-ఏ-తయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయాలి. ఉగ్రదాడులతో తిరిగి భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలనేదే మా అభిమతం’ అని ఆయన తెలిపారు. ‘పాకిస్థాన్‌ తగు చర్యలు తీసుకోకుంటే ఇండియాలో మళ్లీ దాడులు జరిగే అవకాశముంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదులు, వారి శిబిరాల మీద పాక్‌ ఎలాంటి చర్యలు తీసుకుందోనని వేచి చూస్తాం’ అని తెలిపారు. 

ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిందే
‘ఉగ్రవాదాన్ని తుదమొట్టించడానికి అంతర్జాతీయ సమాజం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరముందని అమెరికా భావిస్తోంది. పాక్‌ కూడా ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చర్యలు తీసుకుంది. కొన్ని ఉగ్ర గ్రూపుల నిర్వీర్యం చేయడంతోపాటు జైషే మహ్మద్‌ సంస్థ పరిపాలనా కార్యకలాపాలను నియంత్రించే దిశగా నడుం బిగించింది. కానీ టెర్రరిస్ట్‌లను అరెస్ట్‌ చేయడం.. తర్వాత కొన్ని రోజులకు వారిని వదిలేయడం, దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు, స్వేచ్ఛగా ర్యాలీలు చేసుకునే అనుమతులను ఉగ్ర నాయకులకు కల్పించడం పాక్‌కు పరిపాటి అయిపోయింది. అందుకే ఇంకొన్నాళ్లు పాకిస్థాన్‌ తీసుకునే చర్చలను నిశితంగా పరిశీలిస్తాం.

పాక్‌కు ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ దేశం ఉగ్రవాద నిర్మూలన చర్యలను వేగవంతం చేసి, అంతర్జాతీయ సమాజం ముందు బాధ్యతాయుత దేశంగా నిలబడాలి. లేని పక్షంలో పాక్‌కు ఆర్థిక కష్టాలు తప్పవు. భారత్‌లో ఉగ్రవాదుల అటాక్‌, బాలాకోట్‌లో ఇండియన్‌ ఆర్మీ వాయు దాడులతో దాయాది దేశాల ఆర్మీలు ఇంకా హై అలర్ట్‌గానే ఉన్నాయి. ఇంకొక్క దాడి ఆ పరిస్థితులను ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటి వాటికి తావివ్వొద్దనే తాము ముందస్తుగా పాక్‌ను హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు అటు ఇస్లామాబాద్‌తో ఇటు న్యూఢిల్లీతో మేము సంప్రదింపులు జరిపి.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశాం’ అని సదరు వైట్‌హౌజ్‌ అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు