తీరంలో వందల తిమింగలాల మృతదేహాలు!

10 Feb, 2017 11:27 IST|Sakshi
తీరంలో వందల తిమింగలాల మృతదేహాలు!

వెల్లింగ్టన్: వందల కొద్ది తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చి నిర్జీవంగా పడి ఉండటం జంతు ప్రేమికులతో పాటు సామన్య ప్రజానికాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాల్లోని గోల్డెన్ బే తీరంలో ఈ విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక అధికారి ఆండ్రూ లామసన్ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 416 తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చాయని, అందులో వందకు పైగా తిమింగలాలు చనిపోయి కళేబరాలుగా పడి ఉన్నాయని చెప్పారు.

వందల తిమింగలాలు చనిపోయి నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ప్రాణాలతో ఉన్న కొన్ని తిమింగలాలను మళ్లీ నీటిలోకి వెళ్లేలా చేశారు. తమ వల్ల పూర్తి చర్యలు సాధ్యంకాదని భావించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఎన్ని తిమింగలాలు చనిపోయాయే లెక్క తేల్చడం కష్టంగా ఉందని, పైగా వీటి మధ్య ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాటిని సముద్రంలోకి చేర్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారి ఆండ్రూ లామసన్ తో పాటు న్యూజిలాండ్ రేడియో వెల్లడించారు.

చాథమ్ ఐలాండ్ లో 1918లో అత్యధికంగా 1000కి పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడమే చరిత్రలో భారీ ఘటన. కాగా చివరగా 1985లో 450కి పైగా వేల్స్ ఆక్లాండ్ లో ఇదే రీతిలో తీరానికి వచ్చాయి. న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడో భారీ విషాదకర ఘటన అని అధికారులు చెబుతున్నారు. ఇవి పైలట్ వేల్స్ రకమని, ఈ తిమింగలాలు దాదాపు 20 అడుగుల పైగా పొడవు వరకు పెరుగుతాయని చెబుతున్నారు. వేల్స్ ఇలా తీరానికి కొట్టుకురావడం, చనిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఇంకా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.