వారి జీవితాన్నే మార్చేసిన ‘ఓ సెల్ఫీ’

26 Sep, 2019 17:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒక ఐడియా ఓ జీవితాన్నే మార్చేసింది’ అన్నట్లుగా ‘ఓ సెల్ఫీ’ కూడా వారి జీవితాన్నే మార్చేసింది. లండన్‌లోని మిల్టన్‌ కేన్స్‌ నగరానికి చెందిన లీ థాంప్సన్‌ (37), రాధా వ్యాస్‌ (39)లు ‘మ్యాచ్‌ డాట్‌ కామ్‌’ ద్వారా ఓ రోజు కలుసుకున్నారు. వారి కనులు కనులు కలిశాయి. తొలిచూపులోనే ప్రేమతో పెనవేసుకున్నారు. ఊసులాడుకున్నారు. దేశ, విదేశాలు పర్యటించడమంటే ఇరువురికీ ఇష్టమని తెలుసుకున్నారు. ఇంకేముంది, పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలని కోరుకున్నారు. అందుకు ఉపాధి సంపాదించడం ఎలా ? అన్న ఆలోచన వారిలో సుడులు తిరిగింది. ‘పర్యాటకం అంటే మన ఇద్దరికి ఇష్టం కనుక.

one selfie chage their life

మన ఇద్దరి మోజు తీర్చుకున్నట్లు ఉంటుంది, వ్యాపారం చేసినట్లూ ఉంటుంది. ఒంటరి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఓ ట్రావెల్‌ ఏజెన్సీ పెడదాం’ అని రాధా వ్యాస్‌ అప్పుడే తన కాబోయే భర్తకు సూచించింది. అప్పటి వరకు వారిద్దరు ఒంటరి పర్యాటకులే కనుక ‘ఒంటరి పర్యాటకుల కోసం’ అన్న ఆలోచన వచ్చింది. వారు 15 వేల పౌండ్లతో (దాదాపు 13.3 లక్షల రూపాయలు) ‘ఫ్లాష్‌ ప్యాక్‌’ పేరుతో ఓ ట్రావెల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అంతకుముందే తాము పర్యటించిన ప్రాంతాల ఫొటోలతోపాటు తమ అనుభవాలను కూడా వారు ట్రావెల్‌ వెబ్‌సైట్‌లో వివరించారు.

ఇది 2012లో జరగ్గా రెండేళ్లు గడిచినా వారి వెబ్‌సైట్‌కు ఆదరణ దక్కలేదు. బ్రెజిల్‌లో 2014లో జరిగిన ‘ఫిఫా’ వరల్ట్‌ కప్‌ సందర్భంగా రియో డీ జెనీరియోలోని చారిత్రాత్మక ‘ది క్రైస్ట్‌ ది రిడీమర్‌ స్టాట్యూ’కు మరమ్మతులు చేస్తున్నారని థాంప్సన్‌ దంపతులు విన్నారు. వారికొక ఆలోచన వచ్చింది. ఇరువురు కలిసి ఆ విగ్రహం వద్దకు వెళ్లారు. థాంప్సన్‌ కష్టపడి ఆ విగ్రహం శిఖరాగ్రానికి చేరుకొని అక్కడి నుంచి కింద నగరం కనిపించేలా ఒక్కడే సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని థాంప్సన్‌ దంపతులు ‘ఫ్లాష్‌ ప్యాక్‌’లో పోస్ట్‌ చేయగా, రెండు రోజుల్లోనే 14 లక్షల మంది వీక్షించారు. అంతే, ఆ నాటితో వారి ట్రావెల్‌ ఏజెన్సీ జాతకమే మారిపోయింది.

one selfie chage their life 3

అప్పటి వరకు వారు కలిసే ఉన్నా ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం ఆరు నెలల పాప. ఈ ఐదేళ్లలో వారి వ్యాపారం రెండు కోట్ల పౌండ్లకు (175 కోట్ల రూపాయలకు) చేరుకుంది. చిన్నప్పటి నుంచే తనకు పర్యాటకం అంటే ఎంతో ప్రాణమని ‘ఫిమేల్‌’ పత్రికకు ఇప్పుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తాను ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడే కెన్యాలో ఉంటున్న తన బంధువులను కలుసుకోవడానికి ఒంటరిగా వెళ్లానని, ఆ పర్యటన తనకు అపరిమిత ఆనందాన్ని ఇవ్వడంతో పర్యటించడమే తాను హాబీగా పెట్టుకున్నానని ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు