చిక్కంతా టీలో లేదు.. టీ బ్యాగులోనే!

28 Sep, 2019 12:27 IST|Sakshi

రోజుకొక్కసారైనా టీ తాగకుండా ఉండలేకపోతున్నారా? కార్పొరేట్‌ ఆఫీసుల్లో టెన్షన్‌ ఫ్రీ అవడానికి అంటూ కప్పుల మీద కప్పులు టీ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో లేదు. ఒక్కసారి టీ తాగేవారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీలో ఎన్నిరకాలున్న టీ బ్యాగు ఒకటే కాబట్టి ఎలాంటి టీ తాగినా మీరు అనారోగ్యం బారిన పడక తప్పదు. చిక్కంతా టీలో లేదు.. టీ బ్యాగులోనే ఉంది. మీరు వాడే టీ బ్యాగును విషకరమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా హెల్త్‌ జర్నల్‌ తాజా అధ్యయనంలో ప్రచురించింది.

బయటపడింది ఇలా..
నటలీ టుఫెంక్జీ అనే మహిళ తన ఆఫీసుకు దగ్గర్లోని కెఫేకు వెళ్లి టీ ఆర్డర్‌ చేసింది. వేడివేడిగా పొగలు కక్కుతున్న టీ కప్‌ను తన చేతిలోకి తీసుకుంది. ఇంతలో తన కళ్లు టీ బ్యాగ్‌ మీద పడ్డాయి. అది ప్లాస్టిక్‌తో తయారు చేసారేమోనన్న అనుమానం మొదలైంది. అదేంటో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో పరిశోధన మొదలుపెట్టింది. వేర్వేరు దుకాణాల నుంచి టీ బ్యాగులను తీసుకువచ్చి పరీక్షించింది. అందులో భాగంగా ఒక టీబ్యాగును తీసుకుని వేడినీటిలో పెట్టగానే ప్లాస్టిక్‌ రేణువులు విడుదల అవుతున్నాయి. వీటి సంఖ్య 11 బిలియన్ల మైక్రోప్లాస్టిక్‌, 3 మిలియన్ల నానోప్లాస్టిక్‌ కణాలకు పైగా ఉంది. 

టుఫెంక్జీ ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ కేవలం టీ బ్యాగుల నుంచి ప్లాస్టిక్‌ వస్తోందే తప్ప టీ నుంచి కాదని చెప్పుకొచ్చింది. టీ తాగడం ద్వారా మనకు తెలీకుండానే బిలియన్ల ప్లాస్టిక్‌ కణాలను మనం శరీరంలోకి పంపుతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది. అవి విడుదల చేసే ప్లాస్టిక్‌ రేణువులు మానవ కణంలోకి చొచ్చుకుపోయేంత చిన్న పరిమాణంలో ఉన్నాయంది. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆమె హెచ్చరించింది. కాగా డజన్ల కొద్ది సర్వేలు ఈ విషయంపై ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. మనం తాగే నీటిలో, తినే ఆహారంలో ప్లాస్టిక్‌ కలుస్తోందని చెప్తూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు