దలైలామాకు మాత్రమే ఆ అధికారం ఉంది

28 Nov, 2019 18:09 IST|Sakshi

 కేవలం దలైలామా మాత్రమే తన వారసుడిని నిర్ణయిస్తారు: బౌద్ధ మత పెద్దలు

సిమ్లా: టిబెట్‌ మతపెద్దలు బుధవారం ధర్మశాలలో సమావేశమై దలైలామా వారసుడి ఎంపిక విషయమై చర్చించారు. లామాకే సర్వాధికారాలు ఉండి తన వారసుడిని ఎన్నుకునే ఆచారం అనాదిగా వస్తుందని.. అదే ప్రస్తుత లామా కొనసాగిస్తారని తీర్మానం చేశారు. 3 రోజులపాటు జరిగిన టిబెటన్ మత సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ బౌద్ధ లామాలు, టిబెట్ మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు. టిబెట్‌లో 800 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఆయన కొనసాగిస్తారని.. తదుపరి లామాను ఎన్నుకునే హక్కు కేవలం ప్రస్తుత లామాకు మాత్రమే ఉందని, నిర్ణయం పూర్తిగా దలైలామా వ్యక్తిగతమని పేర్కొన్నారు. అంతేకాక చైనా ఎన్నుకునే లామాను.. టిబెటన్లు ఎన్నడూ గౌరవించరని, లామాను నిర్ణయించే అధికారం ఇతర వ్యక్తులకు, ప్రభుత్వానికి లేదంటూ ఈ మేరకు నొక్కిచెప్పారు. 

ప్రపంచ ప్రఖ్యాత మత గురువులలో ఒకరైన దలైలామాను చైనాలోనే కాక ప్రపంచం నలుమూలలా అనుసరిస్తున్నావారు ఉన్నారు. నిత్యం ఆయనను గౌరవిస్తూ.. నిర్దేశించిన మార‍్గంలో నడిచేవారు ప్రపంచం నలువైపులా ఉండడంతో.. దలైలామా వారసుడిని ఎంపిక చేసే అర్హత ప్రపంచానికి ఉందని గతవారం యూఎస్‌ రాయబారి శ్యాముల్‌ బ్రౌన్‌ తెలిపారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంపిక చేసే హక్కు చైనాకు మాత్రమే ఉందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. తదుపరి దలైలామా ఎవరనే విషయంపై నెలకొన్న ఉత్కంఠను అధిగమించడానికి ఐక్కరాజ్యసమితి సహా ఇతర ప్రపంచ దేశాలు చర్చలు జరపాలని యూఎస్‌ తరపున కోరారు. ముఖ్యంగా మత స్వేచ్ఛ, మానవ హక్కులు గురించి పట్టించుకునే యూరోపియన్‌ దేశాల ప్రభుత్వాలు దలైలామా వారసుడిని ఎంపికపై దృష్టి సారించాలని శ్యాముల్‌ బ్రౌన్‌ పేర్కొన్నారు. దలైలామాను తాను చాలాసార్లు యూఎస్‌లో కలిశానని అన్నారు. టిబెట్‌ బౌద్ధులకు మాత్రమే దలైలామా వారసుడిని ఎంపిక చేసే అధికారం ఉందని, చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఆ అధికారం లేదని పునరుద్ఘటించారు. 

సాధారణంగా టిబెట్‌కే పరిమితమైన దలైలామా వెతుకులాటలో.. ప్రస్తుతమున్న 14వ దలైలామాను ఎన్నుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. టిబెట్‌కు చెందిన ప్రస్తుత 14వ దలైలామా కేవలం రెండేళ్ళ వయసులో 1937 సంవత్సరంలో ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల వయస్సులో అతను అధికారికంగా 14వ దలైలామాగా గుర్తించబడ్డారు. 1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు తరలి వచ్చి ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. 1989లో ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

అయితే దలైలామా వారసుడు చైనా నుంచే వస్తాడని ఇప్పటికే చైనా ప్రకటించింది. తనకు 90 ఏళ్ల వయసు వచ్చాక తన వారసుడిని నిర్ణయిస్తానని దలైలామా 2011లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు. తాను మరణించిన తరువాత.. చైనా ఏకపక్షంగా వ్యవహరించి తన వారసుడిని ప్రకటిస్తే.. అతడిని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండబోదని గతంలో స్పష్టం చేశారు. తదుపరి దలైలామాను నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌరవం దక్కబోదని, తన వారసుడు భారత్‌లోని తన అనుచరుల్లో ఒకరు కావచ్చని ఆశాభావం వ్యక్తం  చేశారు.  తదుపరి దలైలామా వారసుడి ఎంపిక విషయంలో దలైలామా స్పందన చైనాకు మింగుడు పడటం లేదు. గతంలో దలైలామా మాట్లాడుతూ.. తన తర్వాత వచ్చే దలైలామా ఒక వేళ మహిళ అయితే.. ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు