9 మంది మహిళలతో సింగర్‌ బాగోతం

13 Aug, 2019 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒపెరా’ ప్రపంచంలో కూడా ‘మీటూ’ ఉద్యమం ప్రారంభమైంది. వాషింగ్టన్‌ ఒపెరా, లాస్‌ ఏంజెలిస్‌ ఒపెరాలను నిర్వహిస్తూ గాయకుడిగా, కంపోజర్‌గా ఏకంగా 14 గ్రామీ అవార్డులు అందుకున్న సుప్రసిద్ధుడు ప్లాసిడో డొమింగో (78)పై తొమ్మిది మంది మహిళలు ఆరోపణలు చేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో తమపై డొమింగో లైంగిక నేరాలకు పాల్పడినట్లు వారు వెల్లడించారు. ఈ మహిళలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని డొమింగో ఒపెరాతో అనుబంధం ఉన్న 40 మంది మహిళలు చెప్పారు. ఉపాధి పేరిట బలవంతంగా తమను లొంగదీసుకున్నారని తొమ్మిది మంది మహిళలు తెలిపారు. నిరాకరించిన వారిని చేదు అనుభవాలు ఎదురయ్యాయని వారిలో ఏడుగురు మహిళలు చెప్పారు.

అలా లైంగిక వేధింపులకు గురైన మహిళల్లో గాయకులు, డ్యాన్సర్లు, సంగీతవేత్తలు, వాయిస్‌ టీచర్లు, ఇతర స్టేజి కళాకారులు ఉన్నారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే తన పేరును వెల్లడిస్తూ బయటకు వచ్చారు. మిగతా ఎనిమిది మంది పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. రిటైర్డ్‌ గాయకురాలు పట్రీసియా వూల్ఫ్‌ మాత్రమే పేరు వెల్లడించారు. డ్రెసింగ్‌ రూముల్లోకి, హోటల్‌ రూముల్లోకి వచ్చి బలవంతంగా ముద్దులు పెట్టుకునే వాడని తొమ్మిది మంది కాకుండా మరో ముగ్గురు మహిళలు ఆరోపించారు. 1990 దశకంలో ఆయనతో పాడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాక వరుసగా తనను ఇష్టం లేకున్నా విహార యాత్రకు తీసుకెళ్లే వాడని ఓ గాయకురాలు తెలిపారు. ఈ తాజా ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని, తాను ఇంత వరకు ఎవరిని లైంగికంగా వేధించలేదని, అందరు ఇష్టపూర్వకంగానే తనతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ప్లాసిడో డొమింగో చెబుతున్నారు. డొమింగోకు ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. తన కళను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తారని చెబుతారు. నాలుగువేల ప్రదర్శనల్లో 150 పాత్రలకు పాటలు పాడిన ఒపెరా రికార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు