ఒకరికి ఒకరు..!

29 Nov, 2017 04:05 IST|Sakshi
మంగళవారం సదస్సులో భాగంగా జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడుతున్న ఇవాంకా ట్రంప్‌. చిత్రంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

ప్రతి మహిళా పారిశ్రామికవేత్త మరో మహిళకు తోడ్పాటు అందించాలి

జీఈఎస్‌ తొలి సెషన్‌లో వక్తల అభిప్రాయం

పారిశ్రామిక యవనికపై మహిళలు నిలదొక్కుకోవాలంటే పరస్పర సహకారం అవసరమని ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) తొలి సెషన్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఒకరికొకరు తోడుగా ఉండి తదుపరి జీఈఎస్‌కు మరో మహిళా పారిశ్రామికవేత్తను తీసుకురావాలని, ఇందుకు పురుషుల ప్రోత్సాహమూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో మార్పునకు అనుగుణంగా మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. జీఈఎస్‌లో భాగంగా మంగళవారం ‘మహిళా సాధికారత–వివిధ దేశాల్లో మహిళల అవకాశాలు’ అంశంపై చర్చాగోష్టి జరిగింది. సిస్కో సంస్థ చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ దీనికి ప్యానెల్‌ స్పీకర్‌గా వ్యవహరించగా.. భారత్‌ తరఫున రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున ఇవాంకా, ఎస్‌ఆర్‌ఎస్‌ ఏవియేషన్‌ అండ్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ పెట్రోలియం సంస్థ ఎండీ సిబోంగిల్‌ సాంబూ (దక్షిణాఫ్రికా), స్కాండిన్‌ విస్కా ఎన్‌స్కిడ్లా బ్యాంకెన్‌ (సెబ్‌) చైర్మన్‌ మార్కస్‌ వాలెన్‌బర్గ్‌లు పాల్గొని మాట్లాడారు.   
 – సాక్షి, హైదరాబాద్‌

జస్ట్‌ డూ ఇట్‌..: ఇవాంకా
‘‘వ్యాపార రంగంలో ఎంతో మంది విఫలమయ్యారు. మరెందరో విజయం సాధించారు. కొత్త పరిశ్రమలు నెలకొల్పాలనుకునేవారిని నేను కోరేది ఒక్కటే.. ప్రతి ఒక్కరిలో తమ వ్యాపారం విజయవంతం అవుతుందని 100 శాతం నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. వ్యాపార ఆలోచనల పట్ల ఉత్సాహం, వాటి ద్వారా మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పం ఉంటే పరిశ్రమలు స్థాపించండి. జస్ట్‌ డూ ఇట్‌..’’ అని ఇవాంకా సూచించారు. ఆవిష్కరణలకు కేంద్రమైన హైదరాబాద్‌కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులు, మార్గనిర్దేశకత్వం పొందడంతోపాటు కొన్ని దేశాల్లో సరైన చట్టాలు లేక మహిళా పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారని... శాస్త్ర, సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విషయంలో మహిళలు వెనుకబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పరిశ్రమపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. తన తండ్రి డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో అప్పుడే 11 నెలలు పూర్తి చేసుకోవడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో విద్య, నైపుణ్యాభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేజీ నుంచి 12 వరకు విద్య ప్రైవేటీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అమెరికాలో పనిచేసేవారిలో 47 శాతం మహిళలుండగా.. ఐటీ రంగంలో పనిచేసేవారిలో 21 శాతమే ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇంజనీరింగ్‌ రంగంలోనూ మహిళల ప్రాతినిధ్యం 13 శాతమే ఉందని చెప్పారు. ఉద్యోగాల విషయంలో మహిళల వెనుకబాటు ఇలా కొనసాగితే తిరోగమనం దశగా పయనిస్తామని.. అందుకే విద్య ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఏటా విద్యకు 200 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తుందన్నారు.

అంత తేలికేం కాదు: సిబొంగిల్‌ సాంబు
సవాళ్లు ఎదురైనప్పుడు వేగంగా స్పందించే తత్వమే మన విజయావకాశాలను నిర్దేశిస్తుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ ఏవియేషన్స్‌ అండ్‌ పెట్రోలియం కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిబొంగిల్‌ సాంబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తగా ముందుకు సాగడం తేలికైన పనికాదని, దక్షిణాఫ్రికాలో ఓ మహిళగా విమానరంగ వ్యాపారాన్ని నెలకొల్పి విజయవంతంగా నడపడం అంత సులువుగా జరగలేదని ఆమె చెప్పారు. ‘‘ఆఫ్రికాలో విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు ఈ మహిళకు ఎవరు రుణాలిచ్చి ఉంటారని మీకు ఆలోచన రావచ్చు.. విమానాలు నడిపేందుకు స్థానిక ప్రభుత్వం నుంచి తొలి ఆర్డర్‌ సంపాదించినా.. విమాన రంగం నష్టాలతో కూడిన వ్యాపారమంటూ నాకు రుణాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నా దగ్గర తనఖా పెట్టేందుకూ ఏమీ లేదు. దీంతో బంధువుల నుంచి డబ్బులు తీసుకుని వ్యాపారం ప్రారంభించాను..’’ అని సాంబు వివరించారు.

ఎన్నో త్యాగాలు చేయాలి: మార్కస్‌ వాలెన్‌బర్గ్‌ (స్వీడన్‌)
ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య ప్రాంతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, మహిళలు వ్యాపారాలు చేయాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని స్వీడన్‌కు చెందిన సెబ్‌ సంస్థ చైర్మన్‌ మార్కస్‌ వాలెన్‌బర్గ్‌ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మహిళలకు పారిశ్రామిక రంగంలో ద్వారాలు తెరుచుకుంటున్నాయని, ఇలాంటి సమయంలో వారికి మద్దతు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మహిళలకు తోడుండి నడిపించే గురువులు అవసరం. ఎన్నో అనుభూతులు, ఆలోచనలు వారి మెదళ్లను తొలిచేస్తుంటాయి. వారిని ప్రోత్సహిస్తే కచ్చితంగా రాణిస్తారు. వారికి మద్దతివ్వండి.. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దండి. వచ్చే జీఈఎస్‌ సమావేశానికి కనీసం మరో మహిళా పారిశ్రామికవేత్తకు సాయం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి..’’ అని సూచించారు. 

కష్టాలకు వెరవొద్దు: నిర్మలా సీతారామన్‌
భారత మహిళల్లో కష్టపడే లక్షణం ఉందని, 60 ఏళ్లుగా ఈ దేశం అలవరుచుకున్న అభివృద్ధి నమూనా ఎంతోమంది మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మహిళలు వ్యాపార రంగంలోనే కాకుండా విద్యా రంగంలోనూ రాణిస్తూ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పారు. ‘‘అసలు భారత రాజ్యాంగ నిర్మాతల్లో 15 మంది మహిళలు ఉన్నారన్న విషయం అందరూ గ్రహించాలి. అందులో అత్యంత నిమ్న వర్గాల నుంచి వచ్చిన దాక్షాయణి అనే మహిళ కూడా ఉన్నారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనేందుకు ఆమే ఉదాహరణ. అంతరిక్ష రంగంలో దేశాన్ని ముందుకు నడిపిస్తోన్న టెస్సీ థామస్‌ కూడా మహిళే..’’ అని పేర్కొన్నారు.

దేశంలో మహిళలకు విద్యావకాశాలు విస్తృతంగా లేవని, దీనిపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. మహిళలు వ్యాపారం చేసేందుకు రుణం కోసం బ్యాంకులకెళితే పూచీకత్తు అడుగుతారని, కుటుంబ భాగస్వామిగా పురుషుడి సహకారం లేకుండా చాలా మంది మహిళలు పూచీకత్తు ఇవ్వలేరని పేర్కొన్నారు. అందుకే దేశంలోని మహిళలందరికీ తానే పూచీకత్తుగా ఉంటానని మోదీ బ్యాంకులకు హామీ ఇచ్చారని... ప్రతి జిల్లాలోని ఒక్కో షెడ్యూల్‌ బ్యాంకు నుంచి కనీసం ఒక్క మహిళకు స్టార్టప్‌ కంపెనీ కోసం రుణాలు ఇప్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినన్ని ఉద్యోగాలను దీర్ఘకాలం సృష్టించలేవని... యువత వ్యాపారాలు ప్రారంభించి మరికొందరికి ఉపాధి చూపాలన్నారు. ఆ కోణంలోనే స్టార్టప్‌లకు ప్రోత్సాహమిస్తున్నావన్నారు. డిసెంబర్‌ 4న దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లతో సమావేశం అవుతున్నామని, రక్షణ శాఖలోకి పెట్టుబడులకు ఆహ్వానిస్తామని చెప్పారు. జర్మనీ వెళ్లినప్పుడు ఆ దేశ చాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌ కూడా భారత్‌లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారని, ఇజ్రాయెల్‌ కూడా ఆ బాటలోనే ఉందని తెలిపారు. మహిళల్లో స్వయం చొరవ రావాలని, తమకున్న ప్రతి అవకాశం తలుపు తట్టాలని, కష్టాలకు వెరవకుండా ముందుకెళ్లాలని సూచించారు. 

మరిన్ని వార్తలు