‘ఇమ్రాన్‌కు పోటీగా విపక్షాల అభ్యర్థి’

3 Aug, 2018 11:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ నెల 11న పాకిస్తాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆయనకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలైనా నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ, బెనర్‌జీర్‌ భుట్టో కుమారుడి పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)లు ఏకతాటిపైకి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గురువారం రెండు పార్టీల నేతలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఇమ్రాన్‌కు పోటీగా విపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పాటు జరిగిందని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ నేత మర్యమ్‌ ఔరంగజేబు తెలిపారు.

ఎన్నికలు జరిగనప్పటి నుంచి పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ పార్టీలు ఇమ్రాన్‌ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై 25న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్‌ పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం కొన్ని చిన్న పార్టీలు, పలువురు ఇండిపెండెట్ల మద్దతుతో ఇమ్రాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడ్డారు.విపక్షాలు ఎంతగా ప్రయత్నించిన ఇమ్రాన్‌ ప్రధాని కాకుండా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు