అబ్బురపరిచిన వానరం!

8 Feb, 2020 08:38 IST|Sakshi

‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే మంచిమాటను మనుషులు మర్చిపోతున్న పరిస్థితి. ఇక జంతువుల విషయానికొస్తే ఆపదను తెచ్చిపెట్టేవి అవే అయినా.. కొన్నిసార్లు ఆపద నుంచి రక్షించేవి కూడా అవే. ఈ క్రమంలో ఒరాంగుటాన్‌ అనే జంతువు మనిషి ప్రమాదంలో ఉన్నాడని భావించి అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చి అందరినీ అబ్బురపరిచిన ఘటన బొర్నియాలో చోటు చేసుకుంది. బోలెడు తెలివి తేటలుండే ఒరాంగుటాన్‌ అనే వానరం కొన్ని విషయాల్లో మనిషిలాగే ప్రవర్తిస్తాయన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తాజాగా బొర్నియా ప్రాంతంలో సంచరిస్తున్నన ఒరాంగుటాన్‌ బురద నీటిలో సగం వరకు మునిగి ఉన్న ఓ వ్యక్తిని గమనించి అతను ఆపదలో ఉన్నాడని భావించింది. వెంటనే అతన్ని సమీపించి చేయి చాచి సహాయం అందించింది. దీన్ని అనిల్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి ఫొటో తీయగా ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతరించిపోతున్న జీవజాతుల కోసం పనిచేస్తున్న ‘బొర్నియో ఒరాంగుటాన్‌ సర్వైవల్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ ఈ అద్భుతమైన ఫొటోను గురువారం తమ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ‘మనుషుల్లో అడుగంటిపోతున్న మానవత్వాన్ని కొన్ని జంతువులు మనకు గుర్తు చేస్తున్నాయి’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఈ ఫొటో ఎంతోమంది నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. ‘ఆ జంతువు చూపిన ప్రేమకు మేం దాసోహమయ్యాం’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పైన చెప్పుకున్న ఫౌండేషన్‌లో పని చేస్తాడు. కాగా ఆ నదిలో పాముందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దాని కోసం వెదికానని ఆయన పేర్కొన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒరాంగుటాన్‌ తాను ప్రమాదంలో ఉన్నానని భ్రమించి సహాయం చేయడానికి వచ్చిందని తెలిపాడు. అయితే అది అడవు జంతువు కాబట్టి, దాని సహాయాన్ని తిరస్కరించానని తెలిపాడు. (మీ పిడకల వేట అదుర్స్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు