‘రెక్కలగుర్రం’లో అరుదైన కృష్ణబిలం!

18 Aug, 2014 02:18 IST|Sakshi
‘రెక్కలగుర్రం’లో అరుదైన కృష్ణబిలం!

వాషింగ్టన్: మనకు సుమారు 32 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో.. రెక్కల గుర్రం(పెగాసస్) నక్షత్రమండలంలో ఉన్న అరుదైన అతిభారీ కృష్ణబిలం ఊహాచిత్రమిది. మార్కారియన్ 335 అనే ఈ సూపర్‌మ్యాసివ్ బ్లాక్‌హోల్ చుట్టూ ఎక్స్ కిరణాల ఉద్గారం వల్ల అతిప్రకాశవంతమైన కాంతి వలయం వేగంగా తిరుగుతోందట. కరోనా అని పిలిచే ఈ కాంతి వలయం.. కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ కృష్ణబిలం కేంద్రానికి అతి సమీపంలోకి చేరుకుందట. గెలాక్సీ కేంద్రాల్లో అతిభారీ కృష్ణబిలాలు ఉండటం, అవి తమ సమీపంలో ఉండే కాంతితో సహా అన్ని రకాల పదార్థాలనూ తమలోకి లాగేసుకోవడం సాధారణమే అయినా..

ఈ కృష్ణబిలం మాత్రం కాంతిని, పదార్థాన్ని అత్యంత వేగంతో తనలోకి లాగేసుకుంటోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన సూర్యుడి కన్నా కేవలం 30 రెట్లు ఎక్కువ సైజు మాత్రమే ఉన్న ఈ కృష్ణబిలం.. సూర్యుడి కన్నా ఏకంగా కోటి రెట్లు ఎక్కువ పరిమాణంలో గల పదార్థాన్ని, కాంతినీ తనవైపు లాగేసుకుంటోందని వారు చెబుతున్నారు. ఈ కృష్ణబిలం చుట్టూ జరుగుతున్న తాజా మార్పుల గురించిన సంగతులు నాసాకు చెందిన ‘న్యూస్టార్’ అంతరిక్ష టెలిస్కోపు పరిశీలన ద్వారా తెలిశాయి.
 

మరిన్ని వార్తలు