మనమూ అవయవాలు పెంచుకోవచ్చు!

22 Aug, 2014 02:39 IST|Sakshi
మనమూ అవయవాలు పెంచుకోవచ్చు!

వాషింగ్టన్: బల్లితోక తెగిపోతే ఏమవుతుంది? రెండు నెలల్లో తిరిగి మునుపటి సైజుకు పెరుగుతుంది. మనకు కూడా అలా అవయవాలు తెగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి తిరిగి పెరిగితే అద్భుతంగా ఉండేది కదూ! అయితే అన్ని కాకపోయినా.. చెవులు, ముక్కు వంటివాటిలో ఉండే మృదులాస్థి, కండరాలు, వెన్నెముకలోని నాడీకణజాలం వంటివాటివి దెబ్బతిన్నా తిరిగి పెంచుకోవచ్చంటున్నారు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్రో కుసుమి. బల్లితోకలో పునరుత్పత్తికి అవసరమైన జన్యు ప్రక్రియను తాము పూర్తిగా ఆవిష్కరించామని ఆయన వెల్లడించారు.

గ్రీన్ ఆనోల్ లిజార్డ్‌పై పరిశోధించిన కుసుమి బృందం.. ఆ బల్లి తోకలో కణాల పునరుత్పత్తికి ప్రేరేపించే 326 జన్యువులను కనుగొంది. తోక తెగినప్పుడు మిగిలిన బల్లితోకలో నిర్దిష్టమైన భాగాల్లో ఆయా జన్యువులు క్రియాశీలం అవుతున్నాయని, దాంతో తోక నిర్దిష్ట ఆకారంలో తిరిగి పెరుగుతోందని గుర్తించింది. జన్యుపరంగా బల్లికి, మనుషులకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి కాబట్టి.. బల్లితోక పునరుత్పత్తికి తోడ్పడే జన్యువుల మాదిరిగా మనిషిలోనూ ఉండే జన్యువులను నియంత్రిస్తే పలు అవయవాలను తిరిగి ఉత్పత్తి చేయవచ్చని కుసుమి చెబుతున్నారు. తిరిగి పెంచుకోగలవు కాబట్టే.. తమను ఏవైనా పెద్దజంతువులు పట్టుకున్నప్పుడు బల్లులు తమ తోకలను తెంపేసుకుని పారిపోతాయట. బల్లుల్లా ఉండే సాలమాండర్లు, కప్ప టాడ్‌పోల్ డింభకాలు, చేపలు కూడా తమ తోకల చివర్లు తెగిపోతే పునరుత్పత్తి చేసుకుంటాయట.

మరిన్ని వార్తలు