హృదయ కాలేయం@వరాహం

1 Aug, 2019 01:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మన మూలకణాలను పిండంలోకి ఎక్కించి కొత్త ప్రయోగం

పుట్టిన జంతువులోనే పెరగనున్న అవయవాలు

అవసరమైనప్పుడు మన శరీరంలోకి మార్పిడి చేసుకునే వీలు

గుండె సమస్య వచ్చిందా.. కొత్త గుండె కావాలా.. నో ఫికర్‌.. రంధి ఎందుకు పంది ఉందిగా.. మూత్ర పిండాలు చెడిపోయాయి.. కొత్తవి కావాలా.. అలా పందుల ఫాం దాకా వెళ్లొస్తే సరి.. కాలేయం కరాబ్‌ అయిందా.. అరే బాయ్‌.. వరాహం ఉందిగా.. అదే వెయ్యి వరహాలు లెక్క! అసలేంటి? పంది ఉంటే.. ప్రాబ్లెమ్‌ లేకపోవడమేంటి? పందికి మనకు ఉన్న ఆ లంకె ఏంటి?

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సమీప భవిష్యత్తులో పంది మనపాలిట వరాహావతారమే కానుంది. ఎందుకంటే.. మనకు ఏ అవయవం కావాలన్నా.. పంది శరీరం నుంచి తీసుకోవచ్చంటున్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. మన అవయవాలను పందిలో పెంచుకో వచ్చని వారు చెబుతున్నారు. మన మూల కణాలను (స్టెమ్‌సెల్స్‌) వేరే జంతువులోకి చొప్పించి.. మన అవయవాలను పెంచే అవకాశాలపై ప్రొఫెసర్‌ హిరోమిట్సు నకౌచీ అనే శాస్త్రవేత్త తన బృందం తో కలసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా మానవుల అవయవాలను ఏదైనా క్షీరదంలో ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్‌ ప్రభుత్వం వీరికి అనుమతిచ్చింది.

ఇలా పెంచుతారట..
ఇప్పటికే మూల కణాలను ఉపయోగించి అవయవాలను వృద్ధి చేసే ప్రయోగాలు చాలానే జరిగాయి. 
- ఏ అవయవాన్ని పెంచాలనుకుంటున్నామో ముందు శాస్త్రవేత్తలు నిర్ణయించుకుంటారు.
- మన మూల కణాలను క్షీరదం (జంతువు) పిండంలోకి ఎక్కించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎన్‌ఏలో మార్పులు చేస్తారు.
డీఎన్‌ఏ మార్పులు చేయడం ద్వారా మనకు కావాల్సిన అవయవం మళ్లీ  పెరగకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
దీనివల్ల పిండం ఎదుగుతున్న కొద్దీ దాని శరీరం లో వేరే (మానవుడి) అవయవం పెరిగినా ఇబ్బందులు రాకుండా ఉంటుంది.
ఆ తర్వాత ఆ పిండాన్ని తల్లి క్షీరదం గర్భంలోకి ఎక్కిస్తారు.
గర్భంలో సాధారణ జంతువు మాదిరిగానే పెరుగుతుంది.
అయితే పుట్టబోయే జంతువులో మనకు కావాల్సిన అవయవం సాధారణంగా పెరుగు తుంటుంది. కానీ అందులోని ప్రతి కణం మాత్రం మానవుడిదే.
ఆ జంతువు ఎదిగిన తర్వాత మనకు కావాల్సిన అవయవాన్ని ఆ జంతువును చంపేసి తీసుకుని రోగి శరీరంలోకి మార్పిడి చేసుకోవచ్చు.

సాధ్యమయ్యే పనేనా..
మన మూల కణాలను జంతువు తన శరీరంలో ఎలా వాడుకుంటుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఉదాహరణకు మూల కణాలు మనం అనుకున్న అవయవం కాకుండా వేరే భాగాల్లో ముఖ్యంగా జంతువు మెదడులోకి వెళ్లి.. మనలాగే తెలివి మీరితే ఏం చేస్తారన్న దానికి పరిశోధకుల దగ్గర సమాధానం లేదు. ఎంతవరకు మానవుల లాగా వాటి శరీరాలు మారిపోతాయన్నది కూడా సమాధానం లేని ప్రశ్నే. తొలుత ఎలుకలపై ఇలాంటి పరిశోధనలు చేసి, ఆ తర్వాత పందుల పిండాల్లోకి మన మూలకణాలను ఎక్కించి పెంచుతానని ప్రొఫెసర్‌ హిరోమిట్సు చెబుతున్నాడు. ఇలా మన మూలకణాలున్న పిండాలు పూర్తిగా గర్భంలో ఎదిగి ఆ జంతువు ప్రసవం అయ్యే వరకు ఉంచేలా అనుమతినిస్తూ జపాన్‌ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, ఫ్రాన్స్‌ ఇలాంటి ప్రయోగాలకు వారి దేశాల్లో అనుమతివ్వలేదు. అయితే ఈ వివాదాస్పదమైన ప్రయోగం వల్ల భవిష్యత్తులో మానవ విలువల విషయంలో సమస్యలు వస్తాయని, ఇలాంటివి ఇప్పటివరకు ప్రయోగ దశలోనే ఆగిపోయాయని, మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూద్దామని చాలా మంది పెదవి విరుస్తున్నారు.  
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు