జపాన్‌లో భూకంపం.. ముగ్గురు మృతి

19 Jun, 2018 03:14 IST|Sakshi
భూకంపం ధాటికి ధ్వంసమైన ఒసాకాలోని మ్యొటొకు–జి ఆలయ ద్వారం

టోక్యో: భారీ భూకంపంతో జపాన్‌ వణికింది. జపాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాలో సోమవారం రిక్టర్‌ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీవ్రత తక్కువే అయినప్పటికీ శక్తిమంతమైన ప్రకంపనల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. 9 ఏళ్ల బాలిక సహా ముగ్గురు మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 20 లక్షల మంది నివసించే ఒసాకా నగరంలో ఉదయం 8 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది.

భవనాలు ఊగడం, పైపులు పగిలిపోయి నీళ్లు విరజిమ్మడం వీడియోల్లో కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు రోడ్లపైనే నిలిచిపోగా.. చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది.  ఉత్తర ఒసాకాలోని టకట్సుకీలో భూకంపం కారణంగా పాఠశాల గోడ కూలి 9 ఏళ్ల బాలిక మరణించింది. ఓ వృద్ధుడు (80) కూడా గోడ కూలి మృతి చెందగా, ఇంటిలోని బుక్‌ షెల్ఫ్‌ మీద పడటంతో మరో 84 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించే ప్రమాదముందని ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా హెచ్చరించారు. కాగా, జపాన్‌ ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదు. 

మరిన్ని వార్తలు