మరింత ఫ్రెష్‌గా..

11 Jan, 2019 02:28 IST|Sakshi

ప్రతి దానికీ ఓ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది.. 
మందులకు, కూల్‌ డ్రింక్‌లకు, పాలప్యాకెట్లకు.. 
ఇలా అన్నిటికీ.. మరి కూరగాయలకు? పళ్లకు?? 
మనం వండిన ఆహారానికి??? వీటి ఎక్స్‌పైరీ డేట్‌ తెలిసేదెలా?  

నేడే కొనండి.. ఆలసించిన ఆశాభంగం.. 
ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రెండు కొంటే ఐదు ఫ్రీ 
సూపర్‌ మార్కెట్లో బోలెడన్ని ఆఫర్లు..  
తక్కువకు వస్తున్నాయని కొనేశాం.. ఫ్రిజ్‌లో తోసేశాం.. 
కళ్లకు కనిపించినవి వాడుతున్నాం.. కానీ కనిపించకుండా 
కొన్ని లోలోపలే పాడైపోతున్నాయి..  
ఆహారం వృథా.. చివర్లో చూసుకుని.. 
చేసేది లేక చెత్తకుప్పలో పడేయాల్సిన దుస్థితి 
ఇంతకీ పరిస్థితి మారేదెలా? 

ఇంట్లో జరిగే ఆహార వృథా.. చూడ్డానికి చిన్నదే కానీ ఓ పెద్ద సమస్య. దానికి పరిష్కారం ఈ స్మార్ట్‌ కంటెయినర్లని అంటోంది షికాగోకు చెందిన ఒవీ స్మార్టర్‌ వేర్‌. ఎందుకంటే వీటికి తగిలించి ఉండే ఎలక్ట్రానిక్‌ డిస్క్‌లు ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల తాజాదనంపై మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటాయట. ఇవి ఇంటర్నెట్‌తో ఆనుసంధానమై ఉంటాయి. ఆన్‌లైన్‌ డాటాబేస్‌ ఆధారంగా పదార్థాలు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయన్న వివరాలను అంచనా వేస్తాయి. రంగుల ఆధారంగా వినియోగదారులను అప్రమత్తం చేస్తాయి. డిస్క్‌ పచ్చ రంగులో ఉంటే తాజాగా ఉందని అర్థం.

అదే పసుపు రంగులోకి మారితే.. ఫ్రిజ్‌లో ముందు వాడాల్సిన లేదా తినాల్సిన వస్తువు అదే అని సూచిస్తున్నట్లు లెక్క.. ఎరుపు రంగులోకి మారితే.. పాడైనట్లు అన్నమాట. ఇవి మన ఫోన్‌లోని ప్రత్యేకమైన యాప్‌తో లింక్‌ చేసి ఉంటాయి. డిస్క్‌ పసుపు రంగులోకి మారగానే.. ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో సమాచారం వస్తుంది. అంతేకాదు.. స్మార్ట్‌ కంటెయినర్‌లో ఉన్న ఆహార పదార్థాలతో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు. మీ ఏరియాలోని ఇతరులతో పోలిస్తే.. మీరు చేస్తున్న ఆహార వృథాను కూడా తెలియజేస్తుంది.

ఒవీ స్మార్ట్‌వేర్‌ మీ సాధారణ ఫ్రిజ్‌ను స్మార్ట్‌ ఫ్రిజ్‌గా మారుస్తుందని ఆ కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు థాంపన్స్‌ అన్నారు. ‘చాలా మందికి ఆహారాన్ని వృథా చేయడం ఇష్టం ఉండదు. కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతుంటారు.. ఒక్కోసారి ప్యాకెట్లకు ప్యాకెట్లు పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రతి ఇల్లు లెక్కేస్తే.. ఈ వృథా చాలా భారీగా ఉంటుంది. ఈ కంటెయినర్లు ఆహార వృథాను తగ్గించేందుకు తోడ్పడుతాయి’ అని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటున్నారు. మార్చి నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర రూ. 9,100.            
    – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు