చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!

24 May, 2016 15:34 IST|Sakshi
చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!

బీజింగ్ః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనా వాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులను సృష్టించడంలోనూ వారికి వారే సాటి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని వేలమంది ఒకే వేదికపై చేరి, నృత్య ప్రదర్శన చేసి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించారు.

చైనా వాసుల దృష్టి ఈసారి నృత్యం వైపు మళ్ళింది. బీజింగ్, షాంఘైతోపాటు మరో నాలుగు నగరాలను ఎంచుకొని, ఒకేవేదికపైకి  చేరడమే కాదు.... ఏకంగా  31,697 మంది ఒకేసారి నృత్య కార్యక్రమంలో పాల్గొని దాదాపు ఐదు నిమిషాల పాటు అడుగులు కలిపి అందర్నీ ముగ్ధుల్ని చేయడంతోపాటు ప్రపంచ రికార్డును సైతం సాధించారు.

నగరంలోని ప్రముఖ బర్డ్స్ నెస్ట్ స్టేడియం ముందు చేరి పెద్దా చిన్నా వయోబేధం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో సమయానికి వర్షం నేనున్నానంటూ వచ్చి చేరింది. దీంతో నృత్యకారులంతా రెయిన్ కోట్లు ధరించి మరీ డ్యాన్స్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరే ఉండి పర్యవేక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు  ధృవీకరణ పత్రాన్ని అందించారు.

సాధారణంగా మధ్యవయసు, వయసు మళ్ళిన మహిళలు పార్కులు, ప్లాజాల వంటి పబ్లిక్ ప్లేసుల్లో నృత్యం చేస్తుండటం చైనాలో చూస్తాం. అయితే  ఆరోగ్యానికి సహకరించేదిగా భావించి పబ్లిక్ ప్లేసుల్లో చేసే డ్యాన్స్... దానితో పాటు పెట్టే భారీగ మ్యూజిక్ సౌండ్ ఒక్కోసారి చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు వేలమంది స్థానికులు కలసి ఒకేచోట చేపట్టిన నృత్య కార్యక్రమం మాత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాక రికార్డును కూడ తెచ్చి పెట్టింది.

మరిన్ని వార్తలు