విదేశీయుల తరలింపునకు రెడీ!

30 Jan, 2020 03:49 IST|Sakshi
చైనాలోని ఓ గ్రామంలో కరోనాను ఎదుర్కొనేందుకు రసాయనం చల్లుతున్న వ్యక్తి

చైనా స్పష్టీకరణ; ఏర్పాట్లు ప్రారంభించిన భారత్‌

132కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య

బీజింగ్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా బుధవారం పేర్కొంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న వుహాన్‌ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్‌ వచ్చిన తరువాత వారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.  

చైనాకు విమాన సర్వీసుల రద్దు
చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్‌ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ – షాంఘై సర్వీస్‌ను నిలిపేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించగా, బెంగళూరు– హాంకాంగ్‌ రూట్‌లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ–చెంగ్డూ రూట్‌లో 14వరకు సర్వీస్‌లను రద్దు చేశామని ఇండిగో పేర్కొంది.  

‘కరోనా’కు హోమియోపతి, యునానీ భేష్‌
శ్వాస సమస్యలు వస్తే ఫోన్‌ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ బుధవారం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 011–23978046ను ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు విశాఖపట్టణం సహా దేశంలోని 21 విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్‌ వ్యాప్తిని హోమియోపతి, యునానీ మందులు సమర్ధవంతంగా అడ్డుకోగలవని ఆయుష్‌ శాఖ ప్రకటించింది. ఈ దిశగా పనిచేసే కొన్ని ఔషధాలను పేర్కొంది. చైనాలోని హ్యుబయి రాష్ట్రంలో ఈ వైరస్‌ బారిన పడి మరో 25 మంది మృతి చెందారు. మొత్తంగా చైనావ్యాప్తంగా మృతుల సంఖ్య 132కి చేరింది. అలాగే, దాదాపు 6 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించారు.

‘కరోనా’ను తయారు చేసినశాస్త్రవేత్తలు
నోవల్‌ కరోనా రకం వైరస్‌ను ప్రయోగశాలలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారు చేశారు. చైనా బయట వైరస్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారని, దీని సాయంతో కరోనా వైరస్‌పై పరిశోధనలు చేయవచ్చని వారు భావిస్తున్నారు.

భారత్‌కు కరోనా సోకే ప్రమాదం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్‌ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్‌ బారిన పడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్‌ సోకే ప్రమాదం అత్యంత అధికంగా ఉందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనాన్ని బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3స్థానాల్లో థాయిలాండ్, జపాన్, హాంకాంగ్‌ ఉండగా.. అమెరికా(6), ఆస్ట్రేలియా(7), బ్రిటన్‌(17), భారత్‌(23) స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు