శునకాల యజమానులూ.. జాగ్రత్త!

10 Feb, 2019 03:30 IST|Sakshi

ఇంట్లో కుక్క ఉన్నది జాగ్రత్త.. ఇది సాధారణంగా చాలా ఇళ్ల ముందు మనకు కనిపించే బోర్డు.. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నగరంలోని వారికి మాత్రం ఇది వర్తించదు. అక్కడి వాళ్లకు ‘కుక్కలు ఉన్నాయా అయితే యజమానులు జాగ్రత్త’ అనే నినాదం బాగా సరిపోతుంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం శునకాల యజమానులపై తీసుకునే చర్యలు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బహిరంగ స్థలాల్లో శునకాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇటీవల ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎవరైనా కుక్కలను వీధులు, పార్కుల్లోకి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కుక్కల వల్ల తాము ప్రశాంతంగా రోడ్ల మీద తిరగలేకపోతున్నామని, భయాందోళనలకు గురవుతున్నామని ఫిర్యాదులు హోరెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పైఅధికారుల నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయని.. ఇకపై ఎవరైనా రోడ్లపై కుక్కలతో కనపడితే వారికి జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.

అలాగే కుక్కలను కార్లలో తీసుకువెళ్లడం పైనకూడా నిషేధం విధించినట్లు చెప్పారు. శునకాలను కార్లలో తీసుకెళ్లే కారు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రభుత్వ నిర్ణయంపై యజమానులు మండిపడుతున్నారు. ఎంత జరిమానా విధించినా పర్లేదని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని అంటున్నారు. ఇస్లామిక్‌ దేశమైన ఇరాన్‌లో కుక్కలను అపరిశుభ్రమైనవిగా పరిగణిస్తున్నారు. కుక్కలను పెంపుడు జంతువులుగా పరిగణించవద్దని 2010లో ఓ ఇస్లామిక్‌ నేత ఫత్వా జారీ చేశాడంటే శునకాలపై ఉన్న అయిష్టత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు