మానవ పరీక్షలో మెరుగైన ఫలితాలు

16 Jul, 2020 20:50 IST|Sakshi

ఆశాజనకంగా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌

లండన్‌ : కరోనా మహమ్మారి నిరోధానికి తొలి వ్యాక్సిన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై నిర్వహించిన మానవ ప్రయోగాల్లో ప్రోత్సాహకర ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. మానవులపై జరిపిన ప్రాథమిక పరీక్షలో ఈ వ్యాక్సిన్‌ ప్రాణాంతక కరోనా వైరస్‌కు డబుల్‌ ప్రొటెక్షన్‌గా పనిచేస్తుందని గుర్తించారు. వ్యాక్సిన్ డోస్‌ ఇచ్చిన బ్రిటన్‌ వాలంటీర్ల బృందం నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించగా శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలతో పాటు టీసెల్స్‌నూ ఇది ప్రేరేపించిందని వెల్లడైనట్టు ది డైలీ టెలిగ్రాఫ్‌ పేర్కొంది. కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు కొద్దినెలలకే కనుమరుగువుతున్నాయని కొన్ని అ‍థ్యయనాలు పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా రావడం గమనార్హం. అయితే ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌పై ఫలితాలు అద్భుతంగా ఉన్నా ప్రాణాంతక వైరస్‌ను దీటుగా ఎదుర్కొనే దీర్ఘకాల ఇమ్యూనిటీ ఇస్తుందనేందుకు ఇంకా ఆధారాలు లభ్యం కాలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ శరీరంలో యాంటీ బాడీలు, టీ సెల్స్‌ను ప్రేరేపించేలా వ్యాక్సిన్‌ పనితీరు వెల్లడవడం కచ్చితంగా శుభవార్తేనని వారు చెబుతున్నారు. కోవిడ్‌-19 నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ వ్యాక్సిన్‌ డబుల్‌ ప్రొటెక్షన్‌గా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ బృందం వెల్లడించిన హ్యూమన్‌ ట్రయల్స్‌ ఫలితాలను ప్రచురిస్తామని ది లాన్సెట్‌ జర్నల్‌ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ బృందం సరైన దారిలో పయనిస్తోందని ఆక్స్‌ఫర్డ్‌ పరీక్షలకు అనుమతించిన బెర్క్‌షైర్‌ పరిశోధక ఎథిక్స్‌ కమిటీ చీఫ్‌ డేవిడ్‌ కార్పెంటర్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ కచ్చితంగా ఎప్పుడు బయటకు వస్తుందని ఎవరూ తేదీలు ప్రకటించలేరని, సెప్టెంబర్‌ నాటికి వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం, ఆస్ర్టాజెనెకాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. చదవండి: భారత ఫార్మా రంగంపై బిల్‌గేట్స్‌ ప్రశంసలు

>
మరిన్ని వార్తలు