ఇక ఇండో పసిఫిక్‌ కమాండ్‌..!

31 May, 2018 23:14 IST|Sakshi

అసియా, పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించిన అమెరికా సైనిక స్థావరం పేరును ‘అమెరికా పసిఫిక్‌ కమాండ్‌’ నుంచి ‘అమెరికా భారత–పసిఫిక్‌ కమాండ్‌’గా మార్పు చేశారు. ఈ మేరకు అమెరికా సైన్యం బుధవారం పసిఫిక్‌ కమాండ్‌ పేరును  మార్చడం  ప్రాధాన్యత సంతరించుకుంది.  దీని ద్వారా వ్యూహాత్మక ప్రణాళికల్లో భారత్‌ను కీలక భాగస్వామి  చేసేందుకు అమెరికా సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోందని అంచనా వేస్తున్నారు. సైనికపరంగా పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న భారత్‌ పాత్రకు గుర్తింపుగా ఇది దోహదపడుతుందని  భావిస్తున్నారు. అయితే ఈ మార్పు వల్ల వెంటనే అదనపు బలగాలు లేదా యుద్ధనౌకలను ఈ ప్రాంతానికి తరలించే అవకాశం  లేదు. తమ అధికారిక పత్రాల్లో ఆసియా–పసిఫిక్‌ అనే పదానికి బదులు ఇండో–పసిఫిక్‌ అనే పదాన్ని ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. 

పసిఫిక్‌ కమాండ్‌ అంటే ?

  • అమెరికాకు చెందిన అతి పాత, పెద్ద సైనిక స్థావరం. 
  • ఫసిఫిక్‌ మహా సముద్రంలోని హవాయి రాష్ట్రంలోని నావికా కేంద్రం పెరల్‌ హార్బర్‌లో ప్రధానకేంద్రముంది.
  • ఈ కమాండ్‌ పరిధి 10 కోట్ల చదరపు మైళ్ల కంటే ఎక్కువ భూభాగం, 52 శాతం భూ ఉపరితలం వ్యాపించి ఉంది.
  • అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు,ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికా వరకు విస్తరించింది.
  • ఈ ప్రాంతంలో 3,75,000 మంది సైనికులు, ఇతర సిబ్బంది  భారత్‌తో సహా  వివిధ దేశాలపై పర్యవేక్షణ సాగిస్తుంటారు.
  • పసిఫిక్‌–హిందూ మహాసముద్రాల మధ్యనున్న 36 దేశాలు దీని పరిధిలోకి వస్తాయి.
  • యూఎస్‌ఆర్మీ పసిఫిక్, యూఎస్‌ పసిఫిక్‌ ఫ్లీట్, యూఎస్‌ పసిఫిక్‌ ఎయిర్‌పోర్సెస్, యూఎస్‌ మెరైన్‌ ఫోర్సెస్‌ పసిఫిక్, యూఎస్‌ ఫోర్సెస్‌ జపాన్, యూఎస్‌ ఫోర్సెస్‌ కొరియా, స్పెషల్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ ఏరియా, స్పెషల్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ పసిఫిక్‌ ఈ ›ప్రాంతం నుంచే పనిచేస్తాయి. 
  • యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ జాయింట్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్స్‌ సెంటర్, ద సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హ్యుమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ కూడా ఉన్నాయి. 

      - సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు