పాక్‌ ఝలక్‌.. భారత్‌పై ఫిర్యాదు

21 May, 2018 20:40 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌కు పాక్‌ ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. కిషన్‌ గంగ జలవిద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైపోయింది. జమ్ము పర్యటన సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే కిషన్‌గంగ జలవిద్యుత ప్రాజెక్టు.. సింధు జలాల ఒప్పందం 1960కి విరుద్ధమని పాక్‌ వాదిస్తోంది.

ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసే విషయాన్ని రేడియో పాకిస్థాన్‌ సోమవారం ధృవీకరించింది. రానున్న మూడు రోజుల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో తమ అధికారులు చర్చలు జరుపుతారని పాక్‌లో అమెరికా రాయబారి అయిజాజ్‌ చౌద్రి మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం పరిష్కారానికి కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే ప్రపంచ బ్యాంకును కోరింది కూడా. కాగా, ఈ ప్రాజెక్టు డిజైన్‌తో తమకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాక్‌ తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. నదీ గమనంలో మార్పులేకపోయినా, దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందని పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2007లో భారత్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఆశ్రయించింది. దీనిపై స్టే విధించడంతో నిర్మాణ పనులు మూడేళ్లపాటు నిలిచిపోయాయి.

కానీ 2013లో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ‘ఇది సింధు జలాల ఒప్పందంలో భాగమే. జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ప్రకారం కూడా భారత్ ఆ నదులపై డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు’ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరోవైపు వరల్డ్‌ బ్యాంకు కూడా ఒప్పందానికి లోబడే భారత్ జీలం, చీనాబ్ ఉప నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ చెబుతోంది.

మరిన్ని వార్తలు