మోదీని కాదని మన్మోహన్‌కు..

1 Oct, 2019 03:13 IST|Sakshi

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవ ఆహ్వానంపై పాక్‌ 

ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ మధ్య ఒక మైలురాయిగా భావించే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని పాక్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి ఒక వీడియో సందేశంలో చెప్పారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో దర్బార్‌ సాహిబ్, పంజాబ్‌ జిల్లా గురుదాస్‌పూర్‌లో డేరాబాబా నానక్‌ను కలిపే ఈ కారిడార్‌తో భారత్‌లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా కర్తార్‌పూర్‌ సందర్శించవచ్చును. ఈ సందర్శన కర్తార్‌పూర్‌ గురుద్వారాకు మాత్రమే పరిమితం. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్‌ 550వ జయంతి నవంబర్‌12న ఉన్న నేపథ్యంలో నవంబర్‌ 9న ఈ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్‌ నిర్ణయించింది.

భారత ప్రధాని మోదీకే ఈ ఆహ్వానం అందాల్సిందిగానీ కశ్మీర్‌పై ఆర్టికల్‌ 370 రద్దు కారణంగా మోదీపై ఇమ్రాన్‌ గుర్రుగా ఉన్నారు. దీంతో మోదీని కాదని మన్మోహన్‌ను ఆహ్వానించాలని పాక్‌ నిర్ణయించింది. ‘మన్మోహన్‌ మతపరమైన విశ్వాసాలు ఉన్నవారు. పాకిస్తాన్‌లో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. సిక్కు మతానికి చెందిన ఆయనను ఆహ్వానించడమే అన్ని విధాల సముచితం’ అని ఖురేషి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అయితే మన్మోహన్‌ సింగ్‌ ఈ కార్యక్రమానికి వెళతారా అన్నది సందేహమే. ఎందుకంటే పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ పాక్‌లో అడుగుపెట్టలేదు. ఆహ్వానం అందితే మన్మోహన్‌ దానిని తిరస్కరించే అవకాశాలే ఎక్కువని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

>
మరిన్ని వార్తలు