‘పాక్‌ బాధ్యతాయుతమైన దేశం..కానీ భారత్‌ అలా కాదు’

17 Aug, 2019 18:09 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌ ఏదైనా దుస్సాహాసానికి పాల్పడితే వారి చర్యలను తిప్పి కొట్టేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందని పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌(ఆర్మీ మీడియా వింగ్‌) అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ అన్నారు. ప్రతీ అంశంలోనూ పాకిస్తాన్‌ ఎంతో సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అయితే భారత్‌ మాత్రం ఎల్లప్పుడూ తమను బెదిరిస్తూ రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రధాన దేశాలన్నీ కశ్మీర్‌ అంశంలో భారత్‌ను సమర్థించడంతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని కశ్మీర్‌ కమిటీ శనివారం అత్యవసరంగా భేటీ అయ్యింది.

చదవండి : అణ్వాయుధాలపై విధానం మారవచ్చు: రాజ్‌నాథ్‌

ఈ నేపథ్యంలో సమావేశం అనంతరం పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీతో కలిసి గఫూర్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... అణ్వాయుధాల విషయంలో భారత్‌ వైఖరి మారవచ్చంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను గమనించాల్సిందిగా ప్రపంచ దేశాల నాయకులకు విఙ్ఞప్తి చేశారు. దాయాది దేశాల మధ్య ఘర్షణకు కశ్మీర్‌ కేంద్రంగా ఉందని, తమ దేశ భద్రత ప్రస్తుతం కశ్మీర్‌తో ముడిపడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్‌ ఒక బాధ్యతాయుతమైన దేశం. కానీ భారత్‌ అలా కాదు. మమ్మల్ని బెదిరిస్తూ ఉంటుంది. భారత ఆక్రమిత కశ్మీర్‌ వారి బలగాల రాకతో జైలులా మారింది. అసత్యాలను ప్రచారం చేసేందుకు, జెండాలను ఎగురవేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా కశ్మీర్‌ అంశంపై యూఎన్‌లో చర్చ జరిగింది. దీంతో భారత్‌ దుస్సాహసానికి పాల్పడవచ్చు. అయితే వారి చర్యలకు దీటుగా జవాబిచ్చేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. అదేవిధంగా కశ్మీర్‌ విషయంలో ఏకతాటిపై నిలిచి, సోషల్‌ మీడియాలో అండగా నిలుస్తున్న వారికి గఫూర్‌ కృతఙ్ఞతలు తెలిపారు.

చదవండి : ఇది పాక్‌ అతిపెద్ద విజయం: ఖురేషి

కాగా ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తాన్‌ తన మిత్రదేశమైన చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది. ఈ క్రమంలో చైనా జోక్యంతో యూఎన్‌ భద్రతా మండలిలో శుక్రవారం కశ్మీర్‌ విషయమై రహస్య సమావేశం జరిగింది. కానీ యూఎన్‌ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, యూకే ఇది భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశాయి. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిని చేద్దామనుకున్న పాకిస్తాన్‌కు చుక్కెదురైన విషయం తెలిసిందే. అయితే శనివారం విలేకరులతో మాట్లాడిన పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి మాత్రం... యూఎన్‌ భద్రతా మండలి రహస్య సమావేశాన్ని ప్రస్తావిస్తూ..దాదాపు 50 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ విషయంలో తాము అతిపెద్ద విజయం సాధించామని ప్రగల్భాలు పలికారు. శుక్రవారం నాటి సమావేశం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు