మహిళా జర్నలిస్ట్‌ అదృశ్యం.. కలకలం

6 Jun, 2018 09:13 IST|Sakshi

లాహోర్‌: రాజకీయాల్లో సైన్యం జోక్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళా జర్నలిస్ట్‌ అదృశ్యం పాకిస్థాన్‌లో కలకలం రేపింది. ప్రముఖ పాత్రికేయురాలు, ఉద్యమకారిణి గుల్‌ బుఖారి అపహరణకు గురయ్యారన్న వార్తతో పాక్‌ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  మంగళవారం సాయంత్రం ఓ టీవీ ప్రోగ్రాం చర్చా వేదికలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆమెను అడ్డగించిన కొందరు దుండగులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే బుధవారం ఉదయం ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ కోణంలోని అంశం కావటంతో పాక్‌ మీడియా ఛానెళ్లలో రాత్రంతా హైడ్రామా నడిచింది. 

ఎవరి పని?... వక్త్‌ టీవీలో ఓ టాక్‌షోలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో లాహోర్‌ కంటోన్మెట్‌ ప్రాంతం వద్ద ఆమెను కొందరు వ్యక్తులు అడ్డగించి తమ వెంట తీసుకెళ్లినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులే ఆమెను అపహరించి ఉంటారని అంతా ఆరోపించారు. పాకిస్థాన్‌ ప్రభుత్వపాలనలో సైన్యం జోక్యం ఎక్కువైందంటూ మొదటి నుంచి ఆమె తన వాదనను వినిపిస్తున్నారు. దీనికి తోడు జర్నలిస్టుల హక్కుల సాధనకై ఆమె సారథ్యంలోనే పోరాటం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులే ఆమెను కిడ్నాప్‌ చేసి ఉంటారని, ఆమెకు ఏమైనా హని జరిగితే పరిస్థితులు మరోలా ఉంటాయని జర్నలిస్ట్‌ సంఘాలు హెచ్చరించాయి. కానీ, అధికారులు మాత్రం ఆ ఆరోపణలు తోసిపుచ్చగా, ఈ ఉదయం ఆమె ఇంటికి తిరిగొచ్చారు. 

పలువురి సంఘీభావం.. గుల్‌ బుఖారి కిడ్నాప్‌కు గురయ్యారన్న వార్తలపై  పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) నేత మరయమ్‌ నవాజ్‌ ఆమె సురక్షితంగా తిరిగి రావాలంటూ ఓ ట్వీట్‌ చేశారు. సీనియర్‌ జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు కూడా ఆమెకు సంఘీభావం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగటం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఆమె స్పందిస్తేనే అసలు ఏం జరిగిందన్న విషయం తెలిసేది. బ్రిటీష్‌-పాక్‌ సంతతికి చెందిన గుల్‌ బుఖారి ప్రస్తుతం ‘ది నేషన్‌‌’ ఒపీనియన్‌ ఎడిటోరియల్‌ విభాగంలో పని చేస్తున్నారు.

మరిన్ని వార్తలు