వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్‌ మినిస్టర్‌

5 Mar, 2019 11:02 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : అసలే భారత్‌ - పాక్‌ మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇలాంటి సమయంలో ఓ పాకిస్తాన్‌ మంత్రి హిందువులను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఇమ్రాన్‌ ఖాన్‌తో సహా పార్టీలోని సీనియర్‌ మంత్రులంతా సదరు మినిస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ సమాచార మంత్రి ఫయ్యాజుల్‌ హసన్‌ చోహాన్‌ హిందువులను ఉద్దేశిస్తూ.. ఆవు మూత్రం తాగే జనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై దుమారం రేగుతోంది.

వివరాలు.. ఫయ్యాజుల్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ముస్లింలకు ప్రత్యేకంగా ఓ జెండా ఉంటుంది. ఇది మౌలా అలియా ధైర్యానికి, హజ్రాత్‌ ఉమారా శౌర్యానికి ప్రతీక. కానీ మీకంటూ ఎటువంటి ప్రత్యేక జెండా లేదు. మీ చేతుల్లో ఏమి లేదు’ అన్నారు. అంతేకాక ‘గో మూత్రం తాగే మీరు మాకంటే ఏడు రెట్లు ఉన్నతులమనే భ్రమలో ఉన్నారు. కానీ మాకు ఉన్నవి ఏవి కూడా మీకు లేవు. మీరు విగ్రహారాధకులు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఫయ్యాజుల్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.

అయితే ఈ వ్యాఖ్యలను పాక్‌ సీనియర్‌ మంత్రులతో పాటు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఖండించారు. మైనారిటీల పట్ల తప్పుగా వ్యవహరించేవారిని పీటీఐ పార్టీ ఎన్నటికి క్షమించదని.. ఫయ్యాజుల్‌ మీద తగిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు